పొన్నం ప్రభాకర్ కు ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు.. అధిష్టానానికి కాంగ్రెస్ నేతల హెచ్చరిక

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు ఎన్నికల కమిటీల్లో స్థానం కల్పించకపోవడం పట్ల కరీంనగర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ ఏం తప్పు చేశారని ఎన్నికల కమిటీల్లో స్థానం కల్పించలేదని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిటీల్లో అవకాశం కల్పించకపోవడం అంటే ఆయన్ను అవమానపరచడమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి, రోహిత్ రావు, పద్మాకర్ వంటి సీనియర్ నాయకులు కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ ను కలిసి సంఘీభావం తెలిపారు. 

పొన్నం ప్రభాకర్ కు జరిగిన అన్యాయంపై రాష్ట్ర నాయకత్వం స్పందించకపోతే తాడోపేడో తేల్చుకుంటామని కరీంనగర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం తీవ్రంగా పోరాడారని, విద్యార్థి నేత నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడని వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న బీసీ నేత పొన్నం ప్రభాకర్ ను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే ఆయనకు ఎన్నికల కమిటీల్లో స్థానం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.