-
పొత్తు లేకపోవడంతో నష్టమేనంటున్న బీఆర్ఎస్ సీనియర్లు
-
రెండు ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో 9 చోట్ల కామ్రేడ్ల ప్రభావం
-
60 వేల ఓట్ల వరకు ఉండొచ్చని అంచనా
-
గత ఎన్నికల పొత్తుల పైన పార్టీల విశ్లేషణ
నల్గొండ, వెలుగు : వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో దోస్తీ కడితే లాభమెంత..? నష్టమెంత.? అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. 2009 నుంచి 2018 వరకు జరిగిన సాధారణ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ముందేసుకుని కుస్తీ పడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఉన్న బలం ఇప్పుడు లేకపోవడంతో వాళ్లతో కలిస్తే ఎంతమేర ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తోంది.
గతేడాది జరిగిన మునుగోడు బైపోల్ ఫలితాలను ఈ సందర్బంగా విశ్లేషిస్తున్నారు. 2018లో బీఆర్ఎస్ కోల్పోయిన సిట్టింగ్ స్థానాన్ని బైపోల్లో కమ్యూనిస్టుల బలంతోనే మళ్లీ సాధించుకుంది. వచ్చే అసెంబ్లీ ఎ న్నికల్లో బీఆర్ఎస్ కు కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు గురించే చర్చ నడుస్తోంది. నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్ల పరి ధిలోని 9 నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు చెక్కుచెదరని ఓటు బ్యాంకు ఉంది.
ముఖ్యంగా నల్గొండ ఎంపీ సెగ్మెంట్లో నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేటలో కమ్యూనిస్టులకు 40, 50 వేల వరకు ఓటు బ్యాంకు ఉండొచ్చని అంచనా. ఇక భువనగిరి సెగ్మెంట్ పరిధిలో సీపీఎం, సీపీఐలకు కలిపి మునుగోడు, నకిరేకల్, ఆలేరులో 20 వేల మంది ఓటర్లు ఉంటారని కాంగ్రెస్ సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పొత్తు వల్ల కాంగ్రెస్ సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే పార్టీకి నష్టమని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పొ త్తు కుదిరితే మాత్రం దాన్ని పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగించాల్సిన పరిస్థితి వస్తదని అంటున్నారు.
బీఆర్ఎస్కు తీరని నష్టం...
మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఆరాటపడుతున్న బీఆర్ఎస్పై సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. పొత్తు లేకుండా 12 సీట్లు గెలవడం కష్టమని అంటున్నారు. 2014, 2018 ఎన్నికల ఫలితాలకు వ్యత్యాసం చాలా ఉందని, ముఖ్యంగా 2018 ఎన్నిక ల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. చాలా చోట్ల కాంగ్రెస్, స్వతంత్రులు, కమ్యూనిస్టుల సపోర్ట్‌తోనే పాలకవర్గాలు చేజిక్కించుకున్నాయి.
నల్గొండ, హుజూర్నగర్, మునుగో డు, దేవరకొండ, నకిరేకల్, సూర్యాపేట, ఆలేరు లాంటి చోట్ల కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల కంటే ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా తిన్నది. వీటిన్నింటినీ బేరేజు వేసుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు రూలింగ్ పార్టీకి సవాల్‌గా మారనున్నాయి.
పొత్తుపై మిశ్రమ స్పందన...
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పొత్తుపై లీడర్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇరుపార్టీల అగ్రనేతలు చర్చించినప్పుడు పొత్తుకు అభ్యంతరం లేదని చెప్పిన నేతల్లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నట్టు తెలిసింది. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అంత ఆసక్తి చూపలేదని సమా చారం. పొత్తు వల్ల గెలిచే సీట్లు వదులుకోవాల్సి వస్తదని, పైగా ఓట్ల మార్పి డి జరగదని కొందరు సీనియర్లు సందేహిస్తున్నారు. ఈ విషయంలో కామ్రేడ్లు కూడా పక్కా క్లారిటీతో ఉన్నట్టు తెలిసింది.
కాంగ్రెస్‌తో దోస్తీ కుదిరితే...
కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌తో దోస్తీ కడితే నష్టం కంటే లాభమే ఎక్కువగా ఉన్నట్టు గత ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 2009లో మహా కూటమిలో చేరిన కమ్యూనిస్టులు 2014లో వేరుపడ్డారు. ఈ ఎన్నికల్లో కాం గ్రెస్, సీపీఐ కలవడంతో దేవరకొండలో సీపీఐ గెలిచింది. మరో ఐదు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ ఆరు స్థానాలు కైవసం చేసుకుంది. సీపీఎం సొంతగా పోటీ చేసింది. మళ్లీ 2018 ఎన్నికల్లో సీపీఎం బీఎల్ఎఫ్ పేరుతో కొత్త ప్రయోగం చేయడంతో డిపాజిట్లు కూడా దక్కలేదు. సీపీఐ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. కానీ సీపీఐకి నల్గొండలో కాకుండా రాష్ట్రంలో మరో చోట సీట్ల సర్దుబాటు చేశారు.
దీనివల్ల 12 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం నాలుగు చోట్లే గెలిచింది. ఈ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపునకు దోహద పడింది. అదే బైపోల్‌కు వచ్చేసరికి కమ్యూనిస్టులు బీఆర్ఎస్తో కలవడంతో రాజగోపాల్ ఓడిపోయారు. దీన్ని బట్టి చూస్తే కమ్యూనిస్టులతో జతకట్టడం వల్ల కాంగ్రెస్‌కు మేలు జరిగిందనే సీనియర్లు చెపుతున్నారు.