త్వరలో ఏఐసీసీ భారత్ పర్వ్ సమిట్ .. ఏర్పాట్లపై దీపాదాస్ మున్షీ, మహేశ్ గౌడ్, మంత్రులు చర్చ

త్వరలో ఏఐసీసీ భారత్ పర్వ్ సమిట్ .. ఏర్పాట్లపై దీపాదాస్ మున్షీ, మహేశ్ గౌడ్, మంత్రులు చర్చ

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ ఆధ్వర్యంలో త్వరలో భారత్ పర్వ్ పేరుతో ఇంటర్నేషనల్ సమిట్ నిర్వహించే ఏర్పాట్లలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ సమావేశాన్ని హైదరాబాద్ లోగానీ లేదంటే బెంగళూర్ లోగానీ  నిర్వహించాలనే యోచనలో  హైకమాండ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న కాంగ్రెస్ ఐడియాలజీ గల ఎన్నారైలతో ఈ సమావేశం నిర్వహించేందుకు ఏఐసీసీ ప్లాన్ చేస్తున్నది.

 ఒకవేళ హైదరాబాద్ లో నిర్వహిస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ హాల్స్ పక్కన ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్​లో కాంగ్రెస్ నేతలు సమావేశమై చర్చించారు. ఇందులో రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం ఇక్కడి నుంచే ఢిల్లీ  ఏఐసీసీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో  రాష్ట్ర నేతలు పాల్గొన్నట్లు సమాచారం.