ఎమ్మెల్యే గువ్వలను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

అమ్రాబాద్, వెలుగు: మండలంలోని లక్ష్మాపూర్ తండాలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజును శనివారం కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. జీపీ బిల్డింగ్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ జెండా గద్దెను ఎందుకు కూల్చారని ప్రశ్నించగా, ఎమ్మెల్యే అనుచరులు చంద్రు అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని, ఈ గొడవను వీడియో తీస్తున్న వారి ఫోన్లను గుంజుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 

ఎమ్మెల్యే గూండాలా వ్యవహరిస్తుండు..

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గూండాలా వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేత హరినారయణ గౌడ్ మాట్లాడుతూ జీపీ బిల్డింగ్ ఏర్పాటుకు కాంగ్రెస్ గద్దెను కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై నిలదీసిన తమ పార్టీ నాయకులను తిట్టడమే కాకుండా, చేయి చేసుకుని పోలీసులకు అప్పగించి అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. అనంతరం సీఐ అనుదీప్ కు వినతిపత్రం అందించారు. బాధితుడు చంద్రు, ఎంపీపీ శ్రీనివాసులు, రామాంజనేయులు, సంతోష్, మల్లికార్జున్ పాల్గొన్నారు.