వారం లోపు అప్రోచ్‌రోడ్డును పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్ టౌన్, వెలుగు: కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను వారం లోపు పూర్తిచేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. శుక్రవారం ఆర్అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ... కేబుల్‌బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్అండ్ బీ ఈఈ సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్
సేవా ఇస్లావత్, తహసీల్దార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి
దళితబంధు ద్వారా నెలకొల్పిన యూనిట్లతో ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ లో దళిత బంధు కింద గ్రౌండింగ్ చేసిన యూనిట్లను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. మొదటి దశలో యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు సగం డబ్బులు ఇచ్చామని, మిగిలిన మొత్తం డబ్బులు వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హుజరాబాద్ ఆర్డీవో హరిసింగ్, ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి సురేశ్, పాల్గొన్నారు.
విద్యారంగాన్ని కాపాడుకునేందుకు మహా ఉద్యమం
ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
జగిత్యాల, వెలుగు: రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణకు మహా ఉద్యమం నిర్మించాలని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞవాల్క శుక్లా అన్నారు. 41వ రాష్ట్ర మహాసభలు జగిత్యాలలోని గీతా విద్యాలయంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శంకర్, ప్రవీణ్ రెడ్డి ఏబీవీపీ జెండా ఆవిష్కరించి సభను ప్రారంభించారు. ఈ మహాసభలకు చీఫ్‌గెస్ట్‌లుగా ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞవాల్క శుక్లా, మను యూనివర్సిటీ వీసీ పద్మభూషణ్ శ్రీయం హాజరయ్యారు. ఈ సందర్భంగా యజ్ఞవాల్క శుక్లా మాట్లాడుతూ జాతీయవాద సిద్ధాంతం కోసం ప్రాణాలర్పించిన రామన్న, గోపన్న, జితేందర్, మధుసూదన్ గౌడ్ లాంటివారు పుట్టిన జగిత్యాల గడ్డ ఏబీవీపీకి పవిత్ర స్థలమన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో విద్యారంగంలో, నిరుద్యోగ సమస్యలు ఉండవని భావిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పాలనలో అవేమీ నెరవేరలేదన్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ మహాసభల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1100 మంది విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, స్వాగత సమితి అధ్యక్షుడు వాసం శివప్రసాద్, కార్యదర్శి మ్యాన మహేష్, సౌమ్య పాల్గొన్నారు.
విద్యార్థులు సైన్స్ పై అవగాహన పెంచుకోవాలి
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
సిరిసిల్ల టౌన్, వెలుగు: విద్యార్థులు సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషన్ & చారిటబుల్ ట్రస్ట్ లో జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు చీఫ్‌గెస్ట్‌గా ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ జ్ఞానాన్ని అలవర్చుకోవాలన్నారు. అనంతరం సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్. మోహన్ రావు మాట్లాడుతూ చెకుముకి సైన్స్ సంబురాలు ప్రతి విద్యార్థిని శాస్త్రీయంగా ఆలోచించేలా తయారు చేస్తాయన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ విశ్వప్రసాద్, జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ శంకరయ్య గారు, ట్రస్ట్ వ్యవస్థాపకులు మోహన్ రావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి టి. శ్రీనాథ్ పాల్గొన్నారు.
ఘనంగా సోనియాగాంధీ బర్త్‌డే వేడుకలు
సిరిసిల్ల టౌన్, కోనరావుపేట, జమ్మికుంట, వెలుగు: సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌరస్తాలో శుక్రవారం సోనియాగాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పటాకులు పేల్చి, కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్, టౌన్ ప్రెసిడెంట్ సంగీతం శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, పాల్గొన్నారు. కోనరావుపేటలో నిర్వహించిన వేడుకల్లో మండలాధ్యక్షుడు ఫిరోజ్‌పాషా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రుక్మిణి పాల్గొన్నారు. జమ్మికుంటలోని గాంధీ చౌక్ లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడెపు సారంగపాణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సాయిని రవి, పింగిలి రాకేశ్, సూర్య పాల్గొన్నారు.
కోరుట్ల, వెలుగు: సోనియా బర్త్‌డే సందర్భంగా -కోరుట్లలో టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణారావు కేకు కట్ చేసి పంచిపెట్టారు. నాలుగు కోట్ల ప్రజల ప్రత్యేక రాష్ర్టం ఆకాంక్ష నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని కృష్ణారావు అన్నారు. హిమాచల్ ప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకవచ్చి సోనియమ్మకు బహుమానం గా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కోరుట్ల పట్టణ , మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్ , రాజం, లింగారెడ్డి, మహిపల్ రెడ్డి పాల్గొన్నారు.
సింగరేణిలోకార్మిక సంఘాల నిరసన
గోదావరిఖని, వెలుగు : దేశంలో కోల్ ఇండియా, సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం అమలు చేయాలని, ఇందుకు అడ్డంకిగా ఉన్న గైడ్‌లైన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పలు కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. బీఎంఎస్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టగా, ఏఐటీయూసీ, సిఐటీయూ, టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్, ఇప్టూ, తదితర సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి ఆఫీసర్లకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమాల్లో వివిధ సంఘాల లీడర్లు యాదగిరి సత్తయ్య, రమాకాంత్, టి.రాజారెడ్డి, లక్ష్మీనారాయణ, హరిణ్, ఎల్లాగౌడ్, పోచం, శ్రీనివాస్, సారయ్య, ఐ.కృష్ణ, కె.విశ్వనాథ్, ఇ.నరేశ్, కుమార్, జి.రాములు, ఏడుకొండలు పాల్గొన్నారు.