హైదరాబాద్ : వీఎం హోం భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వెనుక సుధీర్ రెడ్డి కుట్ర ఉందని రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహా రెడ్డి ఆరోపించారు. కమిటీ పర్మిషన్ లేకుండా ట్రాక్ ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. సరూర్ నగర్లో ఉన్న ఈ గ్రౌండ్ స్థలంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో చల్లా నరసింహా రెడ్డి వీఎం హోంను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫీజుల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల ప్రాక్టీస్ కోసం అనాథ విద్యార్థుల స్థలంపై వివాదం ఎందుకు సృష్టిస్తున్నారని నిలదీశారు. వీఎం హోం భూముల్లో గడ్డపారలతో తవ్వేందుకు సుధీర్ రెడ్డి ఎవరని అన్నారు. వీఎం హోం సొసైటీకి, విద్యార్థులకు అండగా నిలుస్తామని, వారి తరఫున పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని చల్లా నరసింహారెడ్డి స్పష్టం చేశారు.
వీఎం హోం ఎవరిది.. ? ఎప్పట్నుంచి ఉంది..?
ఇదిలా ఉంటే వివాదం నేపథ్యంలో వీఎం హోం ఎవరిది ఎప్పట్నుంచి ఉందన్న అంశం గురించి పలువురు ఆరా తీస్తున్నారు. నిజాం నవాబు అనాథల సంక్షేమం కోసం తన ప్యాలెస్‌తో పాటు 80 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. విక్టోరియా మహారాణి పేరు మీద దాని పేరు విక్టోరియా హోంగా మార్చారు. దాని కార్యకలాపాల నిర్వహణకు ట్రస్టును ఏర్పాటు చేశారు. నిజాం కాలం నుంచి వీఎం హోంకు ప్రభుత్వం తరపున ప్రత్యేక గ్రాంట్ అందుతోంది.
హైదరాబాద్ నగరం విస్తరిస్తున్నకొద్దీ వీఎం హోం స్థలం విలువ పెరుగుతూ వస్తోంది. తొలుత వీఎం హోం విద్యా శాఖ ఆధీనంలో ఉండగా.. ఆ తర్వాత ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. దాదాపు వందేండ్ల నుంచి ఈ హోమ్ లో అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ హోంలో వెయ్యి మందికి పైగా చదువుకుంటున్నారు.