బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డయ్​.. మన సీట్లు తగ్గినయ్

బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డయ్​.. మన సీట్లు తగ్గినయ్
  • లేకుంటే కాంగ్రెస్​కు 12 నుంచి 14 ఎంపీ సీట్లు వచ్చేవి
  • కురియన్​ కమిటీ ఎదుట ఓడిన అభ్యర్థులు, గెలిచిన ఎంపీల వెల్లడి
  • గాంధీ భవన్​లో పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ భేటీ
  • ఓటమికిగల కారణాలపై నేతలకు ప్రశ్నల వర్షం
  • అందరితో మాట్లాడాక వివరాలు వెల్లడిస్తా

 హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు గంపగుత్తగా బీజేపీకి మళ్లడంతోనే తాము ఓడిపోవాల్సి వచ్చిందని, అలా జరగకుండా ఉంటే గెలిచేవాళ్లమని ఓడిన కాంగ్రెస్​ అభ్యర్థులు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా త్రిముఖ పోరు జరగడమే తమ ఓటమికి కారణమని వెల్లడించారు. గురువారం గాంధీ భవన్ లో కురియన్ కమిటీ (కాంగ్రెస్​ఫ్యాక్ట్​ఫైండింగ్​ కమిటీ)తో లోక్​సభ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు, గెలిచిన ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఓటమికి గల కారణాలను, గెలుపు కోసం అనుసరించిన వ్యూహ రచనను కురియన్​కు వివరించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ కక్ష పెంచుకున్నదని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను రెండో స్థానానికే పరిమితం చేయాలనే కుట్రతో బీజేపీతో కుమ్మక్కైందని, తమ ఓట్లను కాషాయపార్టీకి డైవర్ట్ చేశారని పలువురు అభ్యర్థులు కురియన్  ముందు చెప్పుకొచ్చారు. దీంతో అనూహ్యంగా బీజేపీకి రాష్ట్రంలో  8 సీట్లు వచ్చాయని,  బీజేపీ గెలిచిన ప్రతి చోట బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమైందని వివరించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైందని తెలిపారు. బీజేపీకి బీఆర్ఎస్ సహకరించకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కు 12 నుంచి 14  సీట్లు పక్కాగా వచ్చేవని అన్నారు.  బీజేపీకి బీఆర్ఎస్ సహకరించడం వల్లే మహబూబ్ నగర్, సికింద్రాబాద్, మెదక్ లో  తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయామని వివరించారు. పార్టీ ఇన్​చార్జీలు,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల సహకారం సంపూర్ణంగా ఉందని, అయితే బీఆర్ఎస్, బీజేపీ..రెండూ ఒక్కటవడంతోనే కాంగ్రెస్ కు తక్కువ సీట్లు వచ్చాయని వారు చెప్పారు. 

ప్రశ్నల వర్షం కురిపించిన కురియన్​

గాంధీ భవన్ లో కాంగ్రెస్​నేతలతో ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ త్రీమెన్ కమిటీ భేటీలో ఓడిపోయిన అభ్యర్థులో దానం నాగేందర్ ( సికింద్రాబాద్ ), రంజిత్ రెడ్డి ( చేవెళ్ల ), పట్నం సునీతా రెడ్డి ( మల్కాజిగిరి ), ఈ నీలం మధు ( మెదక్ ), సమీర్ ఉల్లా ( హైదరాబాద్ ),  గెలిచిన ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ( భువనగిరి ), బలరాం నాయక్ ( మహబూబాబాద్ ), కడియం కావ్య ( వరంగల్ ) ఉన్నారు. పార్టీకి సీట్లు తగ్గడంపై కురియన్ తనదైన శైలిలో అభ్యర్థులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఎన్నికల్లో పార్టీలో సమన్వయం ఎలా ఉంది? ఎన్నికల ఇన్​చార్జీలు పూర్తి స్థాయిలో సహకరించారా? పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నేతల నుంచి సహకారం ఎలా అందింది? ప్రచారానికి ముఖ్య నేతలు హాజరయ్యారా? సభలు ఏ స్థాయిలో జనాన్ని ఆకట్టుకున్నాయి? పార్టీ ఓటమికి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఏమైనా కారణం అయ్యాయా? లాంటి ప్రశ్నలు సంధించారు.

 మీరు ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధికి ప్రాతినిధ్య వహిస్తున్నా..ఈ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయని దానం నాగేందర్ ను ప్రశ్నించినట్టు తెలిసింది. కాంగ్రెస్ కు పట్టున్న చోట కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం  ఏమిటని, దీన్ని ఏ కోణంతో  చూడాలని దానంను కురియన్ అడిగినట్టు సమాచారం. ఇక గెలుపునకు ఎలాంటి అంశాలు దోహదపడ్డాయని ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్ ను అడిగినట్టు తెలిసింది.  

వరుస భేటీలు నిర్వహిస్తున్నం: కురియన్

లోక్ సభ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రంలోని పార్టీ అభ్యర్థులు, గెలిచిన ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నామని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చైర్మన్ కురియన్ పేర్కొన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. శుక్రవారం కూడా నేతలతో భేటీ అయి,  ఎంపీ ఎన్నికల ఫలితాలపై వివరాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. అందరితో మాట్లాడిన తర్వాతనే మీడియాకు వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన​ నివాసంలో కాంగ్రెస్​ సీనియర్​ నేతలు పీజే కురియన్​, రకిబుల్​ హుస్సేన్​ మర్యాదపూర్వకంగా కలిశారు. 

కమిటీ ఏర్పాటు మంచి నిర్ణయం: దానం

గెలుపోటములతో సంబంధం లేకుండా హైకమాండ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం శుభ పరిణామమని దానం నాగేందర్​ అన్నారు. జరిగిన లోపాలను సరిదిద్దుకోవడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన మెజార్టీ, గెలుపునకు దోహదపడ్డ అంశాలకు సంబంధించి కురియన్ కమిటీకి నివేదిక ఇచ్చానని ఎంపీ కడియం కావ్య చెప్పారు.  చేవెళ్లలో తన ఓటమికి గల కారణాలను కురియన్ కమిటీ అడిగిందని, దానికి గల వాస్తవ పరిస్థితులను వివరించానని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ అంతర్గత పొత్తు కుదుర్చుకోవడంతోనే కాంగ్రెస్ 8 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చిందని కురియన్ కమిటీ ముందు వివరించినట్టు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.