- కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరిని వద్దంటున్న ఇందిర వర్గం
- పోటాపోటీగా ఇరువర్గాల శ్రేణుల సమావేశాలు
- కడియంకు వ్యతిరేకంగా నేడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి కాంగ్రెస్ శ్రేణుల పిలుపు
జనగామ, వెలుగు : స్టేషన్ ఘన్పూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన అనుచర గణంతో కాంగ్రెస్ లో చేరడం ఖాయం కాగా కాంగ్రెస్ లీడర్లు మాత్రం ససేమిరా అంటున్నారు. కడియంను పార్టీలో చేర్చుకోవద్దని పట్టుబడుతున్నారు. మరో వైపు శ్రీహరి హైదరాబాద్ లోని తన నివాసంలో శనివారం సుమారు వెయ్యి మంది అనుచరులతో సమావేశం అయ్యారు.
అభిమానులు కూడా సై అనడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమే తరువాయిగా మారింది. దీంతో ఇందిర వర్గం మరింత అసహనంతో ప్రెస్మీట్లు పెట్టి కడియం రాకను వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు పలువురు కీలక నేతలు కడియం ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడంతో ఆయన రాకను అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ఇందిర పట్టు
కడియం శ్రీహరి 30 ఏండ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాడని, అతడిని పార్టీలోకి తీసుకోవద్దని ఇందిర దీపాదాస్ మున్షీకి విన్నవించుకున్నారు. నియోజకవర్గంలోని ముఖ్య లీడర్లతో ఆమె గాంధీభవన్ లో ఈ మేరకు శుక్రవారం మొరపెట్టుకున్నారు. ఆ తదుపరి పార్టీ శ్రేణులు స్థానికంగా కడియం రాకను వ్యతిరేకిస్తూ శనివారం మీటింగ్‌లు పెట్టారు. వరంగల్ ఎంపీ స్థానానికి సింగపురం ఇందిర పేరును పరిశీలించాలని పార్టీ హైకమాండ్‌ను కోరారు. కడియం వస్తే యేండ్ల తరబడి పార్టీలో ఉంటున్న తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇన్నాళ్లు అధికారంలో లేకున్నా పార్టీని పట్టుకుని ఉన్నామని, అధికారంలోకి రాగానే కడియం ఆయన అనుచరులు వచ్చి చేరితే తమకు ఇబ్బందులు ఉంటాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కడియంను వ్యతిరేకిస్తూ ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్‌లో నియోజక వర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులంతా తప్పనిసరిగా హాజరుకావాలని వారు కోరారు.
అనుచరులతో కడియం మీటింగ్
తన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న కడియం శ్రీహరి శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో సుమారు వెయ్యి మంది అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ మార్పు నేపథ్యాన్ని వివరించారు. కాంగ్రెస్ లోకి మారడమే ఉత్తమమని చెప్పి అనుచరులను అభిప్రాయం అడిగారు. స్పందించిన వారు ఏ నిర్ణయం తీసుకున్నా వెంట నడుస్తామని చెప్పారు. దీంతో కడియం పార్టీ మారడం లాంఛనంగా మారింది.
ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ పదవులను కాదని తన వెంట వచ్చే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ లీడర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. పాత కొత్త అనే తేడాలు లేకుండా బీఆర్ఎస్ నుంచి తన వెంట వచ్చిన వారిని కాంగ్రెస్ శ్రేణులను కలుపుకు పోతానని అన్నారు.
ఆనవాయితీ కంటిన్యూ
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎప్పుడూ అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుతో ఉండడం ఆనవాయితీగా వస్తోంది. ఇన్నాళ్లు కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్యగా బీఆర్ఎస్ లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. రెండు నెలల క్రితం తాటికొండ బీఆర్ఎస్ కు బై బై చెప్పడంతో గులాబీలో వర్గపోరు తగ్గిందని శ్రేణులు భావించాయి. ముఖ్యంగా కడియం శ్రీహరి అనుచరులు ఆనందంలో మునిగారు. కానీ ఇప్పుడు మళ్లీ కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోవడం..
కాంగ్రెస్ శ్రేణులు వద్దంటుండడం వంటి పరిణామాలతో మళ్లీ కడియం వర్సెస్ ఇందిర వర్గాలుగా పార్టీ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా కడియం రాకతో తీవ్ర నారాజ్‌లో ఉన్న ఇందిరకు హైకమాండ్ ఎటువంటి హామీ ఇస్తుందనే చర్చలు నెలకొన్నాయి. కడియం ఎమ్మెల్యేగా ఉంటే ఇందిర పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగానే కొనసాగుతారా ? మరేదైనా పదవి ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది.
కడియం ను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోవద్దు ..
రఘునాథపల్లి /స్టేషన్ ఘన్పూర్ : కడియం శ్రీ హరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని పలువురు కాంగ్రెస్ నాయకులు శనివారం సమావేశాల్లో తీర్మానం చేశారు. అధికార దహంతో కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి వస్తున్నారని కాంగ్రెస్ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్ లో మండల అధ్యక్షుడు కోళ్ల రవి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిదని, అయినప్పటికీ తల్లి రొమ్ము పాలు తాగి రొమ్మును తన్నిన విధంగా కడియం ప్రవర్తిస్తున్నాడని అన్నారు.
పది సంవత్సరాలు బీఆర్ఎస్ లో పదవులు అనుభవించినా.. ఆధికార దాహం తీరలేదని ఆరోపించారు. పార్టీ లో చేరలానుకుంటే ఎమ్మెల్యే పదవి కి రాజీనామ చేయాలన్నారు. అలాగే.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి కాంగ్రెస్ ఆఫీస్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో 80 వేల ఓట్లు ఉన్న మాదిగలను వెన్నుపోటు పొడిచి వారిని ఎదగనీయకుండా కడియం కుట్రలు చేశారని ఆరోపించారు. నియోజకవర్గ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని కడియం యత్నిస్తున్నాడని ఆరోపించారు. ఇందిర నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తున్నారని తెలిపారు.