రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు : సతీశ్​కుమార్​

రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు : సతీశ్​కుమార్​

హుస్నాబాద్​, వెలుగు : రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​రావుపై కాంగ్రెస్​  నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హుస్నాబాద్​ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్​కుమార్​ విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యతారహితంగా ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన వీడియోలో మాట్లాడిన  క్లిప్పింగ్​ను విలేకరులకు పంపించారు. 

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​రావుకు సోదరులు లేకున్నా, ఆయన అన్న కూతురుకు జెన్​కోలో అక్రమంగా ఉద్యోగాన్ని ఇప్పించుకున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దీనిని వినోద్​రావు ఖండించినా మంత్రి పొన్నం ప్రభాకర్​ అదే అంశాన్ని మీడియా సమావేశంలో లేవనెత్తారన్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.