మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ ఫోకస్

మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ ఫోకస్
  • కొల్లాపూర్​లో ఇప్పటికే పాగా
  • రేపు అచ్చంపేటలో అవిశ్వాస తీర్మానం 
  • నాగర్​ కర్నూల్​ చైర్​పర్సన్​పై అవిశ్వాసం పెట్టేందుకు రెడీ

నాగర్​కర్నూల్, వెలుగు: రాష్ట్రంలో పార్లమెంట్​ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్​ నాయకులు మున్సిపాలిటీలపై దృష్టి సారించారు.  ఇప్పటికే కొల్లాపూర్​ మున్సిపాలిటీ కాంగ్రెస్​ ఖాతాలో పడింది, బుధవారం అచ్చంపేట మున్సిపల్​ చైర్మన్​  అవిశ్వాసం  మీద  ఓటింగ్​ జరుగనుంది.    నాగర్​ కర్నూల్​ మున్సిపాలిటీలో కాంగ్రెస్​ కౌన్సిలర్లు చైర్​పర్సన్​పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. సోమవారం రాత్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డితో సమావేశమైన 15 మంది కౌన్సిలర్లు కలెక్టర్​కు అవిశ్వాస నోటీసు  ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

జిల్లాలో నాగర్​ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి  మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్​  చైర్మన్లు ఉన్నారు. గత నెల 31న కొల్లాపూర్​ మున్సిపాలిటీ కాంగ్రెస్​ వశమైంది. ఇప్పటికే అచ్చంపేట మున్సిపల్​ చైర్మన్​పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన కాంగ్రెస్​  కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లిపోయారు. బీఆర్ఎస్​ నుంచి గెలిచిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరగా, మరో ఇద్దరు చేరనున్నట్లు సమాచారం. అచ్చంపేట మున్సిపాలిటీని దక్కించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సిట్టింగ్​ మున్సిపల్​ చైర్మన్​ నర్సింహాగౌడ్​ అన్ని రకాలు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఎంత వరకు సఫలమవుతాయో బుధవారం తేలనుంది.

అచ్చంపేటలో హై టెన్షన్..​

అచ్చంపేట మున్సిపాలిటీపై గురిపెట్టిన కాంగ్రెస్​ నాయకులు బీఆర్ఎస్​ చైర్మన్​ను కుర్చీ దింపడానికి ప్రయత్నించినా, గతంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పెద్దగా ఇంట్రెస్ట్​ చూపించలేదు.  మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ నేతలను ఓడించిన వారిని పార్టీలో చేర్చుకొని  వారి ప్రాధాన్యం  ఎందుకు తగ్గించాలని ఎమ్మెల్యే వంశీ కృష్ణ భావించారు. బీఆర్​ఎస్​ కౌన్సిలర్లను చేర్చుకోవడానికి మొదట ఇష్టపడని ఎమ్మెల్యే  మారిన పరిస్థితులు, బీఆర్ఎస్​ లీడర్ల దాడులతో తన స్టాండ్ ను మార్చుకున్నారు.

ఫోన్​ ట్యాపింగ్​తో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తనను  రాజకీయంగా ఇబ్బంది పెట్టాడన్న ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్​ అనే మాట వినిపించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.  నల్లమలలో బీఆర్ఎస్​ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న పట్టుతో ఉన్నారు. మున్సిపల్​ ఎలక్షన్స్​లో బీఆర్ఎస్​ నుంచి12 మంది, కాంగ్రెస్  నుంచి ఏడుగురు, బీజేపీ నుంచి ఒక కౌన్సిలర్​ గెలిచారు.

 ప్రస్తుతం బీఆర్ఎస్​ నుంచి నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరారు. మద్దతివ్వడానికి బీజేపీ కౌన్సిలర్​ ఓకే అనడంతో  కాంగ్రెస్ కౌన్సిలర్లు గత నెల 25న చైర్మన్​పై అవిశ్వాస​ తీర్మానం ప్రతిపాదించారు. అనంతరం క్యాంపునకు వెళ్లిపోయారు. కాంగ్రెస్​లోకి వెళ్లిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ వీడకుండా ఉండేందుకు బీఆర్ఎస్​ బంపర్​ ఆఫర్​ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

బీఆర్ఎస్ ను​లేకుండా చేస్తాం..

బీఆర్ఎస్  పదేండ్ల పాలనలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో అభివృద్ది జరగలేదు. బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు నియంతృత్వ పోకడలతో కౌన్సిలర్లు, మున్సిపల్​ పాలకవర్గాన్ని పట్టించుకోలేదు. నిధులు ఖర్చు చేసే విషయంలోనూ పక్షపాతంతో వ్యవహరించారు. అన్ని వార్డులను సమానంగా డెవలప్​ చేస్తాం. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్​ పార్టీ లేకుండా చేస్తాం.  

వంశీకృష్ణ,ఎమ్మెల్యే, నాగర్​ కర్నూల్​  డీసీసీ అధ్యక్షుడు

నోటీస్​ ఇచ్చేందుకు రెడీ..

నాగర్​ కర్నూల్​ మున్సిపల్​ చైర్ పర్సన్​ను గద్దె దించేందుకు కాంగ్రెస్​ నాయకులు పావులు కదుపుతున్నారు. చైర్​పర్సన్, వైస్​ చైర్మన్, మరో ముగ్గురు కౌన్సిలర్లు మినహా మిగిలిన వారిని కాంగ్రెస్​లో చేర్చుకునేందుకు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. త్వరలోనే నాగర్​కర్నూల్​లోనూ అవిశ్వాసం పెట్టేందుకు హస్తం నేతలు రెడీ అవుతున్నారు. ఇదిలాఉంటే కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్​కు సంఖ్యా బలం లేకపోవడం, అవిశ్వాసం, మెజార్టీకి అవసరమైన మ్యాజిక్​ లేక ఇండిపెండెంట్లపై ఆధారపడలేక అవిశ్వాస ప్రయత్నాలకు దూరంగా ఉన్నారు.