సీఎం రేవంత్ కు గ్రాండ్ వెల్ కం

సీఎం రేవంత్ కు గ్రాండ్ వెల్ కం

 

  • శంషాబాద్ కు భారీగా చేరుకున్న కార్యకర్తలు

  • ముఖ్యమంత్రి విదేశీ పర్యటన విజయవంతం

  •  31 వేల 532 కోట్ల రూపాయిల  పెట్టుబడులు 30,750 కొలువులు 

  •  తెలంగాణలో పెట్టుబడులకు 19 కంపెనీల సంసిద్ధత

  • టెక్స్ టైల్ పరిశ్రమపై కొరియన్ కంపెనీల ఆసక్తి

  • 8 నెలల్లో రూ.81 వేల 564 కోట్ల పెట్టుబడులు తెచ్చిన రేవంత్

  •  2015లో 10 రోజులు చైనా వెళ్లిన అప్పటి సీఎం కేసీఆర్

  • 4 కంపెనీలతో ఒప్పందం.. వచ్చింది ...ఒకే పరిశ్రమ

హైదరాబాద్: విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు గ్రాండ్ గా స్వాగతం పలికారు. శంషాబాద్ కు చేరుకున్న ఆయనను శాలువలు పూలమాలలు, బొకేలతో సన్మానించారు. అనంతరం దారి పొడువుతాన పూలు చల్లుతూ రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ  నెల 3న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాలో ప్రపంప ప్రసిద్ధిగాంచిన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెట్టుబడుల స్వర్గధామం హైదరాబాద్ అని, పరిశ్రమలు స్థాపించే వారికి  ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. 

తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని అక్కడే ప్రకటించారు. ఈ పర్యటనలో ఒక్క అమెరికా నుంచే సీఎం 31 వేల 532 కోట్ల  రూపాయిల పెట్టుబడులకు సీఎం ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్‌, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. వీటితో పాటు హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో చెప్పకోదగ్గ మైలు రాయిగా నిలిచింది.

 ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.  స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, ముచ్చర్లలో ఫోర్త్ సిటీ ఏర్పాటుతోపాటు టెక్నాలజీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రపంచస్థాయి  పారిశ్రామిక వేత్తలను ఆకర్షించాయి. అమెరికా పర్యటన సందర్భంగా దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. తద్వారా రాష్ట్రంంలో కొత్తగా 30వేల 750 ఉద్యోగాలు జనరేట్ అవుతాయి. 

అటు కొరియాలోనూ పారిశ్రామిక వేత్తలతో సీఎం భేటీ అయ్యారు. హ్యుందాయ్ అనుబంధ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులను సీఎం కలిశారు. తెలంగాణలో పెట్టుబడులు  పెట్టాలన్న రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి ఆ సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.  కారు మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో  పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి.

కేసీఆర్ తో  పోల్చుతున్న పలువురు

సీఎం అమెరికా, దక్షిణ కొరియా టూర్ ను పలువురు గత సీఎం కేసీఆర్ చైనా పర్యటనతో పోల్చి చూస్తున్నారు. 2015లో చైనా వెళ్లిన అప్పటి సీఎం కేసీఆర్.. పది రోజులపాటు ఆ దేశంలో పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. సెల్​కాన్​, మకనో, షాంఘై ఎలక్ట్రిక్​ కార్పొరేషన్​, లియో గ్రూప్​ లతో తెలంగాణలో   పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే తొమ్మిదేండ్లు దాటినా సెల్ కాన్ కంపెనీ తప్ప మరో  పరిశ్రమ తెలంగాణలోకి ఎంటర్ కాలేదు. రూ. 160 కోట్లతో యూనిట్​ ప్రారంభించింది. ఇదే సందర్భంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన ఎనిమిది నెలల వ్యవధిలో రూ.81 వేల 564 కోట్ల పెట్టుబడులు రాబట్టడం విశేషం. ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

  • రేవంత్ రెడ్డిపాలన.. 8 నెలలు

  • విదేశీ పర్యటనలు.... రెండు (అమెరికా, బ్రిటన్, కొరియా)  
  • పెట్టుబడులు....రూ.81వేల564 కోట్లు     

                   
  • కేసీఆర్ పాలన .. 10 సంవత్సరాలు

  • విదేశీ పర్యటనలు (ఒకటి)    ....(చైనా, 10 రోజులు)
  • పెట్టుబడులు... రూ. 160 కోట్లు (ఒకే కంపెనీ)