కరీంనగర్ : నేషనల్ హైవే -563 అలైన్ మెంట్ మార్పులను సవరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేశారు. జగిత్యాల నుంచి వరంగల్ వరకూ నిర్మించనున్న నేషనల్ హైవే -563 పాత అలైన్ మెంట్ ను టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తొలగించి.. తన సొంత లాభంకోసం కొత్త అలైన్ మెంట్ తీసుకొచ్చారని చెప్పారు. ఈ విషయంపై ఎంపీగా ఉన్న బండి సంజయ్ కుమార్ స్పందించి.. పాత అలైన్ మెంట్ అమలు జరిగేలా చూడాలని కాంగ్రెస్ నేతలు కోరారు. టీ పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి.. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాసిన లేఖను బండి సంజయ్ కు అందజేశారు.
నేషనల్ హైవే -563 కథేంటి..?
జగిత్యాల నుంచి వరంగల్ వరకూ అంటే దాదాపు 127 కిలోమీటర్ల వరకూ నాలుగు లైన్ల రోడ్డు నిర్మించాలని ప్రతిపాదన ఉంది. రూ.4,200 కోట్లకు పైగా నిధులతో నేషనల్ హైవే నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం భూ సేకరణ ప్రధాన సమస్యగా మారింది. నేషనల్ హైవే -563 పాత అలైన్ మెంట్ ను కొనసాగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త అలైన్ మెంట్ వల్ల రూ.500 కోట్ల ఖర్చు అధికంగా అవుతుందని, ఐదు చోట్ల కొత్తగా బ్రిడ్జీలు నిర్మించాల్సి వస్తుందని, 30 కిలోమీటర్ల మేర దూరం పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.