- చేరికలకు ముందే చీలికలు
- ఒకే పార్టీకి మూడు ఆఫీసులు
- ఎవరికి వారు ప్రెస్ మీట్ లు
- కొత్తవారు, పాతవారంటూ విభేదాలు
- లీడర్ల సొంత ఎజెండాతో తిప్పలు
గద్వాల, వెలుగు : ఇన్నాళ్లు కామ్‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొంత ఊపు వచ్చేసరికి లీడర్ల లొల్లి షురూ అయ్యింది. ఇన్నాళ్లు కష్టపడ్డ వారికే టికెట్లు ఇవ్వాలి. కొత్తగా వచ్చే వారికి టికెట్లు ఎట్లా ఇస్తారంటూ ప్రెస్ మీట్ లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. గద్వాల నియోజకవర్గంలో ముగ్గురు లీడర్లు వేర్వేరుగా పార్టీ ఆఫీసులు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 18న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గద్వాలకు రానున్నారు.
కొల్లాపూర్ లో జరిగే బహిరంగ సభలో జిల్లాకు చెందిన జడ్పీ చైర్పర్సన్ సరితతో పాటు మరికొందరు పార్టీలో చేరనున్నారు. కొత్తవారు పార్టీలోకి రాకముందే గద్వాల కాంగ్రెస్ పార్టీలో చీలికలు రావడం కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. ఇక్కడి కాంగ్రెస్ లీడర్లు సొంత ఎజెండాతో పని చేయడం పార్టీని దెబ్బ తీస్తుందని కేడర్ అంటోంది.
మూడు గ్రూపులు.. మూడు ఆఫీసులు..
గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో మూడు గ్రూపులు ఉన్నాయి. ఎవరికి వారు ఆఫీసులను తెరుచుకొని కొంతకాలంగా పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారు. ఎవరికి వారే ప్రెస్ మీట్ లు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం పరిపాటిగా మారిపోయిందని పార్టీ వర్గాలే విమర్శిస్తున్నారు. దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు
వస్తోందని చెప్పినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని విడిచినప్పటి నుంచి పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతున్నాడు.
దీంతో ఆయన టికెట్ ఆశిస్తూ అందరినీ కలుపుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే బీసీ బోయ కమ్యూనిటీకి చెందిన వీరబాబు, రాజీవ్ కూడా పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఆఫీసులు పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా జడ్పీ చైర్ పర్సన్ పార్టీలో చేరుతుండడం వారికి మింగుడు పడడం లేదు.
చేరికకు ముందే..
గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలకు రంగం సిద్ధమైంది. జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే బంధువులతో పాటు బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే అంతకుముందే కాంగ్రెస్ లో చీలికలు రావడం చర్చనీయాంశంగా మారుతోంది.
కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వొద్దని పార్టీ లీడర్లు వీరబాబు, విజయకుమార్ అంటున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారు తమకే టికెట్ కన్ఫామ్ అయిందని చెబుతున్నారని, టికెట్ తాము కొనుక్కున్నామని చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్నారు. పాత, కొత్త వారంటూ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయడాన్ని పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నారు.
సొంత ఎజెండాలతో తిప్పలు..
కాంగ్రెస్ లీడర్లు సొంత ఎజెండాతో ముందుకు వెళ్తుండడంతో పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు. పార్టీలో విభేదాలు సృష్టించేందుకు ఇతరులు రెచ్చగొడితే ప్రెస్ మీట్ లు పెడుతున్నారని పార్టీ శ్రేణులు వాపోతున్నారు. టికెట్ కోసం హైకమాండ్ వద్ద ప్రయత్నం చేసుకోవాలే తప్ప ఇలా బహిరంగంగా విమర్శలు చేయడమేమిటని ప్రశిస్తున్నారు. కాంగ్రెస్ లీడర్ల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.