- ఎమ్మెల్యే రైతుల కోసమా.. కార్లలో తిరగడం కోసమా?
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. భారీ వర్షాలు, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జోగు రామన్న ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలతో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. తమను బలవంతంగా అరెస్టు చేయడం తగదని కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జోగు రామన్న రైతులకు నష్టపరిహారం ఇప్పించలేదు.. ఎమ్మెల్యే ఇంటికొచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించినా.. కలవడం లేదు.. ఆయన కోసం ఎంత కాలం వేచి చూడాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఉన్నది నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం కాదా..? ఆయనకంత తీరిక లేదా..? కేవలం కార్లలో తిరగడం కోసమే ఎమ్మెల్యే ఉన్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.