వేములవాడ, వెలుగు : వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీకి బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించడం హర్షనీయమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామికి 50 కోడెల మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ పట్టణంతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషి చేస్తున్నారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనక్కి వెళ్లిపోయిన రూ.20 కోట్లను వీటీడీఏ సమావేశం ఏర్పాటుచేసి వెనక్కి తెప్పించారన్నారు.
గత పాలకుల అసమర్థతతో రాజన్న ఆలయం అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాలలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ యాదాద్రిని అభివృద్ధి చేశామన్నారని, గతంలో తాను మంత్రిగా ఉండి కూడా సొంత జిల్లాలోని వేములవాడను ఎందుకు పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, లీడర్లు బింగి మహేశ్, పుల్కం రాజు, కనికరపు రాకేశ్, లక్ష్మీరాజం, దైత కుమార్, శ్రీనివాస్, చందుయాదవ్, విష్ణు ప్రసాద్ పాల్గొన్నారు.