కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పదేళ్ల ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన యాత్రను కాంగ్రెస్ నాయకులు, భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ నాయకుల మద్దతుతో నిర్వాసితులు యాత్రకు అడ్డుతగిలారు.
విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ఎమ్మెల్యేకు తమ సమస్య తెలిపేందుకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ పేరుతో తమ భూములను లాక్కొని పరిహారం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భగవంతుగౌడ్, తిరుపతయ్య, ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
సర్పంచ్ అరెస్ట్
మండలంలోని కారుకొండ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను హామీలను నెరవేర్చలేదని వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ శ్రీశైలం, ఎంపీటీసీ భర్త మల్లేశ్ అడుగుతుండగా పోలీసులు సర్పంచ్ ను పోలీస్ జీపులో ఎక్కించారు. దీనిని గ్రామస్తులు అడ్డగించడంతో వారిని స్కూల్ గదిలో నిర్బంధించారు. పాదయాత్ర అయిపోయేంత వరకు గ్రామం చుట్టూ తిప్పిన పోలీసులు ఆ తరువాత సర్పంచ్‌ను గ్రామంలో వదిలి వెళ్లారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నాలుగున్నరేండ్ల కింద స్కూల్లో బాత్రూమ్లు సరిగా లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, కట్టిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. శనివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ను అడగడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని పాదయాత్ర చేయడం ఎందుకని ప్రశ్నించారు.