గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  •     జీరో కరెంటు బిల్లులు అందజేసిన నేతలు

నెట్​వర్క్, ఆదిలాబాద్, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకాన్ని నేతలు ప్రారంభించారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్​ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రజలను కోరారు. స్థానిక గాజులపేట కాలనీలో పథకాన్ని ప్రారంభించి ఓ ఇంట్లో మీటర్ రీడింగ్ తీసి వారికి జీరో బిల్లు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలన్నీ పక్కదోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, విద్యుత్ శాఖ డీఈ జయంత్ చౌహాన్, బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, సాదం అరవింద్, స్థానిక కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. భైంసాలో గృహజ్యోతి పథకాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు.​ కిసాన్​గల్లిలో జీరో బిల్లులు అందజేశారు. డీఈ శ్రీనివాస్ ​రెడ్డి, ఏడీఈ ఆదిత్య, ఏఈ మోహన్ కుమార్, కౌన్సిలర్​ గౌతం పింగ్లే, లీడర్లు గంగాధర్, తాడేవార్​సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

పెంబి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వప్నిల్ రెడ్డి గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు జీరో బిల్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోంన్నారు. వచ్చే పార్ల మెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

కాగజ్ నగర్ పట్టణంలోని ఓల్డ్ కాలనీలో విద్యుత్ అధికారులు జీరో కరెంటు బిల్లులను పంపిణీ చేశారు. అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి తుకారం, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఏఈలు కమలాకర్, జగన్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.