కేంద్ర పరిశీలకుల ముందే వనపర్తిలో కాంగ్రెసోళ్ల లొల్లి

కేంద్ర పరిశీలకుల ముందే వనపర్తిలో కాంగ్రెసోళ్ల లొల్లి
  • ఒకరినొకరు తోసుకున్న మూడు వర్గాల కార్యకర్తలు 
  • మాజీ మంత్రి చిన్నారెడ్డి  తప్పుకోవాలని నినాదాలు
  • సముదాయించలేక వెనుదిరిగిన లీడర్లు


వనపర్తి, వెలుగు: పార్టీ బూత్ లెవెల్ మీటింగులో కాంగ్రెస్ లీడర్లు బాహాబాహీకి దిగారు. కేంద్ర కమిటీ కార్యకర్తలు , నాయకుల సమక్షంలోనే తోపులాడుకున్నారు.  వనపర్తి పట్టణంలోని ఎంవైఎస్ ఫంక్షన్​హాల్​లో బుధవారం కాంగ్రెస్​పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్  నేతృత్వంలో నిర్వహించిన బూత్​ లెవెల్ ​పార్టీ మీటింగ్​కు కేంద్ర కమిటీ పరిశీలకుడు పీవీ మోహన్, రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ మల్లు రవి హాజరయ్యారు.
 నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మేఘా రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు మాట్లాడుతూ మాజీ మంత్రి చిన్నారెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకొని కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరారు. ఆయన ఒంటెత్తు పోకడలతో పార్టీకి నష్టం జరిగిందన్నారు. యువజన కాంగ్రెస్ కమిటీలను తన ప్రమేయం లేకుండా చిన్నారెడ్డి  నియమించడాన్ని యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి తప్పుపట్టారు. 
దీంతో చిన్నారెడ్డి వర్గీయులు శివసేనా రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి గా శివసేనారెడ్డి వర్గీయులు చిన్నారెడ్డి గో బ్యాక్ అంటూ నినదించారు. దీంతో సమావేశం గందర గోళంగా మారింది. మేఘా రెడ్డి వర్గీయులు మరో అడుగు ముందుకేసి మాజీ మంత్రి చిన్నారెడ్డి ఈ సారి పోటీ నుంచి తప్పుకొని వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డికి  సహకరించాలని కోరారు. ఈ క్రమంలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి, శివ సేన రెడ్డి వర్గీయులు ఒకరినొకరు తోసుకున్నారు. 
దీంతో కేంద్ర పరిశీలకుడు పీపీ మోహన్ , మల్లు రవి అవాక్కయ్యారు. గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. క్రమశిక్షణ తప్పినవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశాన్ని హైకమాండ్​ నిర్ణయిస్తుందని, అంతవరకు ఈ విషయంపై  ఎవ్వరూ మాట్లాడవద్దని హెచ్చరించారు. కొత్త, పాత నాయకులు కలిసి పార్టీని వనపర్తిలో మరింత బలోపేతం చేయాలే తప్ప గొడవలకు దిగడం కరెక్ట్​ కాదని మాజీ ఎంపీ మల్లురవి చెప్పారు. 
 మాజీ మంత్రి చిన్నారెడ్డికి, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేనా రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, ఇటీవల పార్టీలో చేరిన పెద్దమందడి , వనపర్తి ఎంపీపీలు మేఘా రెడ్డి, కిచ్చారెడ్డి కాంగ్రెస్​విధానాలను పాటించాలని సూచించారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ కొత్తగా వచ్చిన వాళ్లు  తనకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ గొడవ కారణంగా కార్యకర్తల నుంచి పూర్తి స్థాయిలో అభిప్రాయాలు సేకరించకుండానే కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు, మరో నేత మల్లు రవి వెనుదిరిగారు.