బీర్లకు మంత్రి పదవి ఇవ్వాలని పాదయాత్ర

యాదగిరిగుట్ట, వెలుగు : ప్రజల బాగు కోసం అహర్నిశలు కృషి చేసే ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పాదయాత్ర చేశారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సొంత గ్రామమైన యాదగిరిగుట్ట మండలం సైదాపురం నుంచి మొదలైన పాదయాత్రను మాజీ ఉప సర్పంచ్ దుంబాల వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు శిఖ ఉపేందర్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నం వరకు యాదగిరిగుట్టకు చేరుకుని వైకుంఠ ద్వారం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. బీర్ల ఫౌండేషన్ ద్వారా ఆలేరు ప్రజలకు అనేక సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో బీర్ల అయిలయ్యకు చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సైదాపురం మాజీ వార్డు సభ్యుడు అచ్చిన సిద్దేశ్వర్, నాయకులు బీర్ల రాజశేఖర్, నంద వెంకటేశ్, జిల్లా జానకిరాములు, గందమల్ల కిష్టయ్య, యూత్ అధ్యక్షుడు గుండా సిద్దులు తదితరులు పాల్గొన్నారు.