కాంగ్రెస్​ నేతలు ​నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిందే!

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులిద్దరినీ  విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. రాహుల్​ గాంధీ ఇప్పటికే విచారణకు హాజరయ్యారు కూడా. ప్రస్తుతం ఈ అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వీళ్లు ఎందుకు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియాలంటే నేషనల్ హెరాల్డ్ పత్రిక పుట్టుపూర్వోత్తరాలు, అనంతర పరిణామాలు తెలుసుకోవాలి. స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశ ప్రజలకు జాతీయ వాణిని తెలియజేయాలని1938లో జవహర్​లాల్ నెహ్రూ మరికొందరు ఫ్రీడం ఫైటర్లతో ‘నేషనల్ హెరాల్డ్’ పేరుతో పత్రిక ప్రారంభించారు. దీని ప్రచురణ కోసం1937 నవంబర్ 20న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) పేరుతో ఒక అన్ లిస్టెడ్ సంస్థను స్థాపించారు. రూ.5 లక్షల మూలధనంతో 2000 ప్రిఫరెన్షియల్ షేర్లు, 30 వేల ఈక్విటీ షేర్లుగా, ఒక్కో ప్రిఫరెన్షియల్ షేరు విలువ రూ.100 గాను, ఈక్విటీ షేర్ ముఖ విలువ రూ.10గా నిర్ణయించారు. దీంతో 5000 మంది స్వాతంత్ర్య ఉద్యమకారులు షేర్ హోల్డర్లుగా ఆ సంస్థలో చేరారు. ఇది కాంగ్రెస్​ పార్టీ సొంత సంస్థ కాదు. ఆ సమయంలో పత్రికకు ఉన్న ఆదరణతో ఈ  ఏజేఎల్ సంస్థకు దేశవ్యాప్తంగా ఢిల్లీ, లక్నో, ముంబై తదితర నగరాల్లో అప్పటి లెక్కల ప్రకారం దాదాపు రూ.2 వేల కోట్ల దాకా స్థిరాస్తులు సమకూరాయి. అయితే 1942లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ పత్రికను నిషేధించడంతో మూతపడింది. నెహ్రూ ప్రధాని అయ్యాక సంస్థ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తర్వాత పత్రిక ఆదరణ కోల్పోవడంతో ఆర్థిక సమస్యల కారణంగా 2008లో మూత పడింది. ఈ సమయంలో ఏజేఎల్ సంస్థ కాంగ్రెస్​ పార్టీకి రూ.90 కోట్ల అప్పు బాకీ పడింది.  

సుబ్రమణ్యస్వామి కేసుతో..

వేలాది మంది షేర్ హోల్డర్లకు చెందిన ఈ సంస్థకు ఉన్న వేల కోట్ల రూపాయల ఆస్తులను సోనియా, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోర, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరులు కాజేసేందుకు ఏజేఎల్, యంగ్ ఇండియన్ సంస్థల ఒప్పందం పేరుతో కుట్ర చేశారని 2012లో అప్పటికే జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సుబ్రమణ్యస్వామి ఢిల్లీ కోర్టులో కేసు వేశారు. కేసును కొట్టేయాలని సోనియా, రాహుల్​తదితరులు 2014లో ఢిల్లీ కోర్టుతోపాటు 2015లో హైకోర్టును ఆశ్రయించారు. వారి విజ్ఞప్తులను న్యాయస్థానాలు తోసిపుచ్చాయి. కింది కోర్టులో కేసు విచారణను ఎదుర్కొని తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. 2016లో సుప్రీంకోర్టు కెళ్లగా అక్కడా నిరాశే మిగిలింది. అంతకు ముందే 2014లో ఈ కేసులోకి ఈడీ రంగప్రవేశం చేసి కేసు విచారణను చేపట్టడమే కాకుండా 2019లో రూ.64 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. 2008లో మూతపడే నాటికి ఏజేఎల్ సంస్థ ఇవ్వాల్సిన రూ.90 కోట్ల బకాయిని 2010లో కాంగ్రెస్​ పార్టీ అప్పటికి కొన్ని నెలల ముందే ప్రారంభించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ యంగ్ ఇండియన్ అనే సంస్థ ఈ కేసులో ఉన్న నిందితులందరిది. ఈ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న సోనియా, రాహుల్ గాంధీలకు38 శాతం చొప్పున అంటే మొత్తం76 శాతం వారిద్దరి వాటాగా ఉండగా, మిగిలిన 24 శాతం కాంగ్రెస్ ​నాయకులైన మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, పాత్రికేయుడు సుమన్ దుబె, పారిశ్రామికవేత్త శ్యామ్ పిట్రోడాలకు చెందినవిగా ఉన్నాయి.  

5 వేల కోట్లకు పైగా ఆస్తులు

స్వాతంత్ర్యం తర్వాత ఏజేఎల్ సంస్థ ఆస్తుల విలువ గణనీయంగా అంటే రూ.5000 కోట్లకు పైగా చేరుకుంది. ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్న ఏ సంస్థ అయినా కేవలం రూ.90 కోట్ల అప్పులను చెల్లించలేక కంపెనీని అమ్ముకుంటుందా? అనేది ప్రధాన ప్రశ్న. ఇక్కడే నిందితులందరూ కలిసి మాయాజాలం చేశారని స్వామి ఆరోపణ. కేవలం రూ. 5 లక్షల మూలధనంతో ప్రారంభించిన యంగ్ ఇండియన్ అనే చిన్న సంస్థ రూ.50 లక్షలకే వేల కోట్ల రూపాయల విలువైన ఏజేఎల్​సంస్థ ఆస్తులను, షేర్లను కొట్టేసినట్లయింది. ఈ విషయంలో కుట్ర లేకపోతే యంగ్ ఇండియన్ అనే సంస్థను అప్పటికప్పుడు కొత్తగా ఎందుకు ప్రారంభించారు? రూ.వేల కోట్ల ఆస్తులున్న సంస్థ కేవలం రూ.90 కోట్ల అప్పును తీర్చలేకపోయింది ఎందుకు? ఈ విషయంలో సోనియా, రాహుల్ గాంధీలు నిర్దోషులైతే ఈ వ్యవహారాన్ని ఎందుకు అడ్డుకోలేదు? ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ తన నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి, ఇదేదో బీజేపీ కుట్రగా ఆరోపిస్తుండటం సరికాదు.

- శ్యామ్ సుందర్ వరయోగి,
సీనియర్ జర్నలిస్ట్,
బీజేపీ రాష్ట్ర నాయకులు