ఎల‌‌క్టోర‌‌ల్ బాండ్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

ఆదిలాబాద్/ నిర్మల్/మంచిర్యాల, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్లకు వ్యతిరేకంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్​బీఐ బ్యాంక్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఈ బాండ్ల ద్వారా బీజేపీకే లబ్ధి చేకూరుతోందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు.

బాండ్లు కొనుగోలు చేసిన వారి పేర్లు బ‌‌య‌‌ట పెట్టాల‌‌ని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఎస్​బీఐ తాత్సారం చేస్తోంద‌‌ని మండిప‌‌డ్డారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నగేశ్, నాయకులు గిమ్మ సంతోష్, పోతారెడ్డి ఇందిర, లత  పాల్గొన్నారు.

తప్పుడు విధానాలపై రాజీలేని పోరాటం

ఎలక్టోరల్ బాండ్ల  విషయమై  కేంద్ర ప్రభుత్వం, ఎస్​బీఐ అవలంభిస్తిన్న విధానాలపై రాజీ లేని పోరాటం చేస్తామని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు వెల్లడించారు. నిర్మల్​లోని ఎస్​బీఐ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శ్రీహరి రావు మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్ల జారీ పేరిట ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఈ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్​రెడ్డి, మైనారిటీ నాయకుడు అర్జుమన్, పోశెట్టి, నాందేడపు చిన్ను పాల్గొన్నారు. బీజేపీ ఎలక్టోరల్ బాండ్లను బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఎస్బీఐ ఎదుట ధర్నా చేశారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ.. బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలను బహిర్గతం
చేయాలన్నారు.