తడిసిన వడ్లు కొనాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ రాస్తారోకో

తడిసిన వడ్లు కొనాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ రాస్తారోకో

ములుగు (గోవిందరావుపేట)/నర్సంపేట/నెక్కొండ/రేగొండ, వెలుగు : అకాల వర్షం వల్ల తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనాలని కాంగ్రెస్‌‌ లీడర్లు మంగళవారం ఆందోళనకు దిగారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో హైవేపై, వరంగల్‌‌ జిల్లా చెన్నారావుపేటలో, నెక్కొండ అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఓ వైపు కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతుండడం, మరో వైపు అకాల వర్షాలు పడుతుండడం వల్లే రైతులు నష్టపోతున్నారన్నారు. పైగా తాలు, తరుగు పేరుతో మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌‌ చేశారు.

చల్వాయిలో జిల్లా అధ్యక్షుడు అశోక్‌‌, మండల వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ రసపూత్‌‌ సీతారాంనాయక్‌‌, కిసాన్‌‌ సెల్‌‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌‌గౌడ్‌‌,  మహిళా అధ్యక్షురాలు కొమురం ధనలక్ష్మి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్, బ్లాక్‌‌ కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్‌‌రెడ్డి, నర్సంపేటలో కిసాన్‌‌ సెల్‌‌ ప్రెసిడెంట్‌‌ భూంపల్లి దేవేందర్‌‌రావు, మండల అధ్యక్షుడు భూక్య గోపాల్‌‌నాయక్‌‌, బత్తిని రాజేందర్‌‌, నెక్కొండలో టీపీసీసీ మెంబర్‌‌ సొంటిరెడ్డి రంజిత్‌‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, బీసీసెల్ సెల్ జిల్లా కార్యదర్శి రాచకొండ రఘు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా గణపురంలో రైతులు మక్కలు, వడ్లకు నిప్పు పెట్టి, రాస్తారోకో నిర్వహించారు. వీరికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్‌‌చార్జి గండ్ర సత్యనారాయణరావు మద్దతు ప్రకటించారు. 

అకాల వర్షానికి తడిసిన వడ్లు, మక్క

పర్వతగిరి/మరిపెడ/మహాముత్తారం, వెలుగు : వరంగల్‌‌ జిల్లా పర్వతగిరి, మహబూబాబాద్‌‌ జిల్లా మరిపెడ మండలంలో, భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో మంగళవారం ఉదయం వర్షం పడింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్లు, మక్కజొన్న తడిసిపోయాయి. రాశుల మధ్య నీరు చేరింది.