ఆందోళనలు.. అరెస్టులు

ఆందోళనలు.. అరెస్టులు

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు : దళితబంధు అర్హులకే ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల వద్ద హైవేపై కాంగ్రెస్​ నేతలు ఆందోళనకు దిగారు. దళితబంధు కోసం అర్హులను కాకుండా అధికార పార్టీకి కావాల్సినవారిని ఎంపిక చేశారంటూ మండిపడ్డారు. శనివారం కాంగ్రెస్ ​మండల అధ్యక్షుడు పుట్ట నర్సింగ్​ రావు ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా దళితులతో కలిసి  పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జీ కాట శ్రీనివాస్​ గౌడ్ హాజరై కానుకుంట చౌరస్తాలో అంబేద్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం  మెదక్–-హైదరాబాద్​ హైవే పై  భైఠాయించారు. కేసీఆర్​ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడుతూ న్యాయం జరగాలని కొట్లాడితే పోలీసులు అరెస్టు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అర్హులందరినీ ఎంపిక చేయకుండా కొందరిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారంటూ బొంతపల్లి గ్రామానికి చెందిన దళితకుటుంబాలు ఆందోళనకు దిగాయి.  పంచాయతీ కార్యదర్శిని నిర్భందించి నిరసన తెలిపారు. 

డిపో ముందు కార్మికుల ధర్నా

సిద్దిపేట/మెదక్​టౌన్/గజ్వేల్, వెలుగు : రాష్ట్ర సర్కారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు శనివారం ఉమ్మడి జిల్లాలోని ఆయా ఆర్టీసీ బస్ డిపోల ముందు కార్మికులు రెండు గంటల పాటు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్మిక నేతలు మాట్లాడుతూ గవర్నర్ ఆర్టీసీ విలీన బిల్లును వెంటనే ఆమోదించి ప్రభుత్వానికి పంపాలని కోరారు. 

జీపీఎఫ్​ పెండింగ్​ నిధులు కోసం.. 

మెదక్/సంగారెడ్డి టౌన్, వెలుగు: పెండింగులో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్​ (జీపీఎఫ్​) నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీపీటీఎఫ్​ ఆధ్వర్యంలో శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లా పరిషత్​ ఆఫీస్​ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్ కుమార్, మెదక్​లో టీపీటీఎఫ్​ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగయ్య, వెంకట్రామ్​రెడ్డి మాట్లాడారు. జీపీఎఫ్​ లోన్​, పార్ట్​ ఫైనల్​ అమౌంట్​ రాక పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిల్లు,  వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన టీచర్స్​కు ఇవ్వాల్సిన  భూస్టర్ నిధులు సైతం 2006 నుంచి పెండింగులో ఉన్నాయన్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి ఆయా జిల్లాల్లో మిస్సింగ్ క్రెడిట్స్ క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మెమోరాండంను అధికారులకు అందజేశారు. 

సెకండ్ ఏఎన్​ఎంలు.. 

మెదక్​ టౌన్/సిద్దిపేట రూరల్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెకండ్ ఏఎన్​ఎంలు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టగా అక్రమంగా అరెస్టు చేశారని నిరసిస్తూ శనివారం ఉమ్మడి జిల్లాలోని ఆయా కలెక్టరేట్ల​ఎదుట వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్, మెదక్​లో సెకండ్​ ఏఎన్​ఎం సంఘం రాష్ట్ర నాయకురాలు సంగీత మాట్లాడారు. 15 ఏండ్లుగా పీహెచ్​సీలలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్​ఎమ్​లను  పర్మినెంట్ చేయాలని,  సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి, అధికారులకు పలుమార్లు  విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా సెకండ్​ ఏఎన్​ఎంలను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.