ఒక్కడినే వెళ్తానన్నా ఒప్పుకోలే.. పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం

ఒక్కడినే వెళ్తానన్నా ఒప్పుకోలే.. పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం

ఘజియాబాద్: లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఘాజీపూర్ బార్డర్‎లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఆయన సంభల్ వెళ్లకుండా ఆపారు. ఇటీవల యూపీలోని సంభల్‎లో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం బుధవారం అక్కడికి వెళ్లేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర నేతలు ఘాజీపూర్ బార్డర్‎కు చేరుకోగా.. సంభల్ వెళ్లేందుకు అనుమతిలేదని పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు.

బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతలను ఆపేశారు. అప్పటికే అక్కడికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో కొన్ని గంటల పాటు టెన్షన్ వాతావరణం నెలకొంది. సంభల్‎లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, అక్కడికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతిలేదని పోలీసులు చెప్పారు. అయితే తాను ఒక్కడినే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని, అవసరమైతే పోలీసులు కూడా వెంట రావాలని రాహుల్ కోరారు.

అయినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు. దీంతో దాదాపు 2 గంటల పాటు బార్డర్‎లో వేచి చూసిన రాహుల్, ప్రియాంక చేసేదేంలేక ఢిల్లీకి తిరిగి వెళ్లారు. మరోవైపు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఘాజీపూర్ బార్డర్‎లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

కాగా, సంభల్‎లోని షామీ జామా మసీదు స్థలంలో గతంలో ఆలయం ఉండేదని, మొగల్ రాజులు దాన్ని కూల్చి మసీదు కట్టారని ఆరోపిస్తూ స్థానిక కోర్టులో పిల్ దాఖలైంది. దీంతో మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టాలని కోర్టు ఆదేశించింది. సర్వే చేయడానికి వెళ్లిన అధికారులపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో నలుగురు చనిపోయారు.

ఒక్కడినే వెళ్తానన్నా ఒప్పుకోలే..

సంభల్‎కు ఒక్కడినే వెళ్తానని చెప్పినా పోలీసులు అనుమతించలేదని రాహుల్ గాంధీ తెలిపారు. ‘‘సంభల్‎కు బయలుదేరిన మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని చెబుతున్నారు. లోక్ సభ ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్లే హక్కు నాకుంది. నేను ఒక్కడినే వెళ్తానని చెప్పినా ఒప్పుకోలేదు. పోలీసులు కూడా రావొచ్చని చెప్పినా అంగీకరించలేదు” అని చెప్పారు.