- ఎంపీ సీటును కైవసం చేసుకోవాలి పార్టీ నేతలతో మంత్రి సీతక్క
A/ ఖానాపూర్/ కడెం వెలుగు: బీఆర్ఎస్ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణంపై ఆటో యూనియన్లను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలంతా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం నిర్మల్‌లోని రాజరాజేశ్వర గార్డెన్స్‌లో జరిగిన జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీడీఏను ఏర్పాటు చేస్తే పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లను నిర్వీర్యం చేసిందని, బీసీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయలేదన్నారు.
బాసరలోని ట్రిపుల్ ఐటీని గాలికి వదిలేసిందన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులంతా ధైర్యంగా ఉండాలని, వారి సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణ రావు పటేల్, రేఖ నాయక్, కంది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రబీ పంటకు పూర్తిస్థాయిలో నీరందిస్తం
ఖానాపూర్, కడెం మండలాల రైతులకు జీవనధారమైన సదర్ మాట్ ఆయకట్టుకు ఈ రబీ సీజన్లో పూర్తిస్థాయిలో సాగు నీటి విడుదల చేసేలా కృషి చేస్తానని మంత్రి సీతక్క అన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో కలిసి సదర్ మాట్ ఆనకట్టను సందర్శించారు.
రైతులు రబీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సరిపడా నీటిని వదలకపోవడం సరికాదన్నారు. సదర్ మాట్ ఆయకట్టు సాగు నీటి విషయాన్ని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అధికారులను కలిసి చర్చించి, నీరు అందించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సీఈ శ్రీనివాస్, ఎస్ ఈ సుశీల్ కుమార్, ఈఈ రామారావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సత్యం తదితరులు పాల్గొన్నారు.
కడెం ప్రాజెక్టు సందర్శన
జిల్లాలోని కడెం ప్రాజెక్టును మంత్రి సందర్శించారు. ప్రాజెక్టు వరద గేట్లను, ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రూ.5 కోట్లతో తాత్కాలిక రిపేర్లు చేపడుతున్నామన్నారు. పూర్తిస్థాయి మరమ్మతులకు త్వరలో ఎస్టిమేషన్ వేసి, రెండు పంటలు సాగయ్యేలా నీరందించేందుకు ప్రాజెక్టును తీర్చిదిద్దుతామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టు పరిస్థితి దారుణంగా మారిందని మండిపడ్డారు. ప్రాజెక్టు రిపేర్ల దృష్ట్యా ఆయకట్టు రైతులకు ఈ ఒక్క ఏదాడి క్రాప్ హాలిడే ప్రకటించామని తెలిపారు.