తుది దశకు పీసీసీ చీఫ్ ఎంపిక .. సీఎం విదేశీ పర్యటన ముగిసాక ప్రకటించే చాన్స్

తుది దశకు పీసీసీ చీఫ్ ఎంపిక .. సీఎం విదేశీ పర్యటన ముగిసాక ప్రకటించే చాన్స్
  • ఎంపీ బలరాంనాయక్ పేరు దాదాపుగా ఖరారు
  • ఒక్కో సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లు

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ ఎంపిక తుది దశకు చేరుకున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నా రు. వచ్చే నెల రెండో తేదీన సీఎం విదేశీ పర్యటనకు వెళ్లి 14న తిరిగి రానున్నారు. సీఎం వచ్చిన తరువాతే పీసీసీ చీఫ్​ను ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ చీఫ్ పదవికి మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ పేరు దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తున్నది. కేబినేట్​లో లంబాడ సామాజిక వర్గం నుంచి మంత్రి లేకపోవడంతో అన్ని ఈక్వేషన్లు చూసి లంబాడ సామాజిక వర్గానికి చెందిన బలరాం నాయక్ పేరు ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. 

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నారు. మైనారిటీ వర్గం నుంచి ఫిరోజ్ ఖాన్, మాదిగ వర్గం నుంచి సంపత్ కుమార్, బీసీ కురుమ సామాజిక వర్గం నుంచి గద్వాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య యాదవ్, రెడ్డి సామాజిక వర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​గా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్​ను కొనసాగించనున్నారని సమాచారం.