
- నల్లగొండ జిల్లా వనిపాకలలో నిర్మాణానికి సన్నాహాలు
- ఈ నెల 19న శంకుస్థాపన
సీఎం రేవంత్ రెడ్డికి త్వరలో గుడి కట్టబోతున్నారు. రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలలో ఈ గుడి నిర్మిస్తారమని మార్చి 19వ తేదీన భూమిపూజ చేయనున్నట్టు రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్ తెలిపారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు సీఎం రేవంత్ రెడ్డి అని, దేవుడిలా తమ కోరికలను రేవంత్ రెడ్డి తీరుస్తున్నాడని అందువల్లే ఆయనకు గుడి కట్టబోతున్నట్లు సంతోష్ చెప్తున్నారు.
ప్రజల బాగోగులు చూస్తున్న కారణ జన్ముడికి గుడి కట్టడం తమ అదృష్టం అని చెప్పారు. భూమి పూజ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలని కోరారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రధాని మోదీకి, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు మాజీ సీఎం కేసీఆర్ కు, దివంగత సీఎంలు వైఎస్సార్, ఎన్టీఆర్ లకు సైతం అభిమానులు గుడులు నిర్మించి పూజలు చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డికి సైతం గుడి నిర్మిస్తామని రెడ్డి సంఘం ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.