పీసీసీ చీఫ్, కేబినెట్​ విస్తరణపై ఇవాళ క్లారిటీ

పీసీసీ చీఫ్, కేబినెట్​ విస్తరణపై ఇవాళ క్లారిటీ
  •    రాష్ట్ర నేతలతో హైకమాండ్ చర్చలు
  •     పార్టీ పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి భట్టి
  •     కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, ఉత్తమ్ భేటీ
  •     శుక్రవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయం
  •     వరంగల్ టూర్ వాయిదా వేసుకొని ఢిల్లీలోనే ఉన్న సీఎం 
  •     సోనియాను కలిసిన మధు యాష్కీ, మహేశ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై శుక్రవారం క్లారిటీ వచ్చే అవకాశంఉంది. ఈ విషయాల్లో ఇంకా ఆలస్యం చేయకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

 గురువారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో ఆయనతో రాష్ట్ర ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ మీటింగ్​లో కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్​ ఎంపికపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్ర కేబినెట్ లో ఆరు బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో రెండు పెండింగ్ లో పెట్టి మిగతా నాలుగు భర్తీ చేయాలని భావిస్తున్నారు. 

సామాజిక సమీకరణలు, జిల్లాల ప్రాతినిథ్యం, సీనియారిటీ, లోక్​సభ ఎన్నికల్లో పనితీరును బేరీజు వేసుకొని కేబినెట్​లో బెర్త్ లు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎవరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో శుక్రవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ముందుగా నిర్ణయించిన శుక్రవారం నాటి వరగంల్ పర్యటనను వాయిదా వేసుకొని సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండిపోయారు. ఇక గురువారం సొంత జిల్లా పర్యటనలో ఉన్న భట్టికి హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో ఆయన తన కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకొని మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన కూడా అక్కడే ఉన్నారు.

పాతవారికి ప్రాధాన్యం తగ్గొద్దు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలను స్పీడప్ చేయాలని మీటింగ్​లో పార్టీ జాతీయ నేతలు రాష్ట్ర నేతలను కోరినట్లు సమాచారం. ఇదే సమయంలో జీవన్ రెడ్డి విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే కొత్త వారిని తీసుకుంటే పాత వారి ప్రాధాన్యం తగ్గకుండా చూడాలని ఈ సందర్భంగా రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలు సూచించినట్లు తెలిసింది. మరోవైపు పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న మధు యాష్కీ, మహేశ్ కుమార్ గౌడ్ గురువారం పార్లమెంట్ లో సోనియా గాంధీని కలిశారు. ఈ పదవి బీసీలకు ఇవ్వాలనే చర్చ సాగినట్లు సమాచారం. దీంతో వారిద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ మాదిగ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే సంపత్ కుమార్ కు చాన్స్ ఉందని అంటున్నారు.

చేరికలపై చర్చించాం: భట్టి 

కేబినెట్ విస్తరణ, పార్టీ ఆర్గనైజేషన్ గురించి పార్టీ జాతీయ నేతలతో చర్చించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో.. వాటిని దృష్టిలో ఉంచుకుని ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించామన్నారు. కాంగ్రెస్ లో చేరికల అంశం పై కూడా చర్చ జరిగిందని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న వాళ్లకు సముచిత స్థానం ఇవ్వాలని కోరామన్నారు.