
- అటు బీజేపీ, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల నిరసన
- ఫామ్ హౌజ్ ముట్టడికి నిర్వాసితుల అల్టిమేట్
- మరోవైపు చలో సెక్రటేరియట్ కు బీఆర్ఎస్ ప్లాన్
సిద్దిపేట, వెలుగు: గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ అటు అసెంబ్లీ సమావేశాలకు, ఇటు నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులతో పాటు మల్లన్న సాగర్ నిర్వాసితులు, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆయనపై ముప్పేట దాడికి దిగారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు రెండుసార్లు ఫామ్ హౌజ్ ముట్టడించగా, ఇప్పుడు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
తమ సమస్యలను ప్రస్తావించడం కోసం అసెంబ్లీకి వెళ్లాలని లేదంటే ఫామ్ హౌజ్ ను ముట్టడిస్తామని మల్లన్న సాగర్ నిర్వాసితులు అల్టిమేట్ జారీ చేశారు. కేసీఆర్ పై ఒత్తిడి పెంచడం కోసం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు ఏకంగా రాజ్ భవన్ కు పాదయాత్రను ప్రారంభించారు. 15 నెలలుగా అసెంబ్లీకే రాని కేసీఆర్ రూ.57 లక్షలు వేతనంగా తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నియోజకవర్గంలో హాట్‌టాపిక్ గామారింది.
పాదయాత్రతో కాంగ్రెస్ పోరు బాట
అసెంబ్లీకి దూరంగా ఉంటున్న కేసీఆర్ వైఖరిపై కాంగ్రెస్ పత్యక్ష ఆందోళనను ప్రారంభించింది. ఇప్పటికే గజ్వేల్ ఎమ్మెల్యే కనిపించడం లేదని యూత్కాంగ్రెస్నేతలు పీఎస్‌లో కంప్లైంట్ఇవ్వడమే కాకుండా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో పాటు యూత్ కాంగ్రెస్ నేతలు పాదయాత్రగా రాజ్ భవన్ కు వెళ్లి ఈ నెల 24 న గవర్నర్ ను కలిసి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండడంలేదనే విషయాన్ని చెప్పనున్నారు. పాదయాత్ర గజ్వేల్ నియోజకవర్గం గుండా సాగుతుండడంతో కేసీఆర్ ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదనే విషయాన్ని అందరికి వివరిస్తున్నారు.
ఇప్పటికీ క్యాంపు ఆఫీసుకు దూరంగా..
గజ్వేల్ నియోజకర్గ కేంద్రంలో ఏడేండ్ల కింద నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు దూరంగానే కేసీఆర్ విధులు నిర్వహిస్తున్నారు. 2019లో క్యాంపు ఆఫీసు ప్రారంభమైనా సీఎంగా ఉండడంతో ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచే అధికారులు, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు.
గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను గజ్వేల్‌లోని క్యాంపు ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించినా 15 నెలలుగా అక్కడికి రాలేదు. క్యాంపు ఆఫీసులో స్థానిక నేతలు సమావేశాలు నిర్వహిస్తుంటే వోఎస్డీ అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. మూడోసారి గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిన్నర కావస్తున్నా క్యాంపు ఆఫీసుకు రాకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్యాంపు ఆఫీసుకు రాకుండా ఫామ్ హౌజ్‌లోకి అనుమతించక పోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
చలో సెక్రటేరియట్ కు బీఆర్ఎస్ ప్లాన్
కేసీఆర్ పై బీజేపీ, కాంగ్రెస్ తో పాటు మల్లన్న సాగర్ నిర్వాసితులు, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ముప్పేట దాడికి దిగుతుండడంతో బీఆర్ఎస్ నేతల్లో కదలిక మొదలైంది. ప్రతిపక్షాల దాడికి చెక్ పెట్టేందుకు గజ్వేల్ నియోజకవర్గంలో రుణమాఫీ జరగలేదనే అంశాన్ని తెరపైకి తెచ్చి సిద్దిపేట కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు బీఆర్ఎస్ నేతలు పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతులతో కలసి 80 కిలోమీటర్ల పాదయాత్రకు వ్యూహరచన చేస్తున్నారు.