కాంగ్రెస్​ నేతల ఢిల్లీ బాట .. టికెట్ కోసం అక్కడే మకాం

కాంగ్రెస్​ నేతల ఢిల్లీ బాట ..  టికెట్ కోసం అక్కడే మకాం
  •   వనపర్తి కోసం ముగ్గురు నేతల  తీవ్ర ప్రయత్నాలు
  •   గాడ్​ ఫాదర్ల ద్వారాహైకమాండ్​పై ఒత్తిళ్లు.

వనపర్తి, వెలుగు: ఢిల్లీ కేంద్రంగా కేంద్రంగా కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ అసెంబ్లీ టికెట్లు ఖరారు చేస్తున్న నేపథ్యంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ నేతలు హస్తిన బాట పట్టారు. వారం రోజులుగా హైకమాండ్​ దృష్టిలో పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల నేతలు టికెట్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. తమ గాడ్​ ఫాదర్లకు హైకమాండ్ తో ఉన్న సంబంధాలతో టికెట్ సాధించేందుకు ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు, నలుగురు నేతలు పోటీ పడుతున్నారు.  

వనపర్తి నియోజకవర్గంలో తనకు మరో అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి కోరుతున్నారు. ఆయనకు సోనియా గాంధీ కుటుంబంతో ప్రత్యక్షంగా అనుబంధం ఉండడంతో తనకే చాన్స్ ఇవ్వాలని హైకమాండ్​పై ఒత్తిడి పెంచారు. నాలుగు, ఐదు రోజుల్లో  విడుదలయ్యే మొదటి జాబితాలో  తన పేరు ఉండేలా చిన్నారెడ్డి కసరత్తు మొదలు పెట్టారు. 

యువజన కోటాలో....

తనకే వనపర్తి టికెట్ ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి  హైకమాండ్​ వద్ద గట్టిగా ప్రయత్నిస్తున్నారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఈసారి వనపర్తి టికెట్ తనకే దక్కుతుందని నమ్మకంగా ఉన్నారు. మరోపక్క  పెద్దమందడి ఎంపీపీ మేఘా రెడ్డి సైతం టికెట్ కోసం తన ప్రయత్నాలు మొదలుపెట్టారు.  బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్ లో చేరేటప్పుడే తనకు వనపర్తి టికెట్ కేటాయిస్తామని పార్టీ హామీ ఇచ్చిందని ఆయన చెప్పుకుంటున్నారు. వనపర్తి టికెట్ మేఘా రెడ్డికి ఇప్పిస్తానని జూపల్లి కృష్ణారావు తనతోపాటు ఢిల్లీకి తీసుకెళ్లారు. దీంతో జూపల్లి తీరును చిన్నారెడ్డి, శివసేనారెడ్డి వ్యతిరేకిస్తున్నారు.  


కొల్లాపూర్ లో  సీనియర్ నేత జగదీశ్వర్ రావుకు కాకుండా జూపల్లికి టికెట్ ఇస్తే తాము సహకరించబోమని కొందరు నేతలు ప్రకటించారు. ఇక్కడ మరో ఇద్దరు కూడా టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, బీసీ నేత ప్రదీప్ గౌడ్ తమకే   టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు.  మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి, నారాయణ పేట డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి ముదిరాజ్, ఎన్ఆర్ఐ పోలే చంద్రశేఖర్, నాగరాజు  పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు.            

సర్వేల ఆధారంగానే.. 

గతానికి భిన్నంగా ఈసారి గెలుపు గుర్రాలను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ  సర్వేలు నిర్వహించిందని అంటున్నారు.  ప్రజల్లో ఉండి గెలిచే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రజల మద్దతు ఎవరికి ఉందన్న దానిపై కూడా ఇప్పటికే పలుమార్లు పార్టీ బృందాలు సర్వే  నిర్వహించాయి. వనపర్తిలో తామే మొదటి స్థానంలో ఉన్నామంటూ ఒకపక్క చిన్నారెడ్డి, మరోపక్క శివసేనారెడ్డి, మేఘా రెడ్డి చెప్పుకుంటున్నారు.  

చిన్నారెడ్డి మూడు నాలుగు నెలలుగా వనపర్తి నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారం ముగించారు.  యువకులకు అవకాశాలు ఇవ్వాలని శివసేనారెడ్డి, మేఘా రెడ్డి కోరుతున్నారు. తమ ఇద్దరిలో ఎవరికి టికెట్ వచ్చినా పరస్పరం సహకరించుకోవాలని అవగాహనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.       

అభ్యర్థులపై ఉత్కంఠ..                  

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే  సిట్టింగ్ ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా బీఆర్ఎస్ ప్రకటించింది.  వనపర్తిలో  మంత్రి నిరంజన్ రెడ్డి రెండోసారి తాను గెలుస్తానంటూ ధీమాతో ఉన్నారు.   వెయ్యి శాతం  గెలుస్తానంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. దేవరకద్ర సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, కొల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఎవరిని ఎంపిక చేస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

దాని ప్రకారం ఎలాంటి వ్యూహం అమలు చేయాలో క్యాడర్ తో సమాలోచనలు చేస్తున్నారు.మరోపక్క   అభ్యర్థుల ఎంపికపై బీజేపీ త్వరలో ఓ ప్రకటన చేయనుండటంతో ఆ పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆయా నియోజకవర్గాలలో తమకే టికెట్ వస్తుందని క్యాడర్ కు బీజేపీ లీడర్లు దగ్గర అవుతున్నారు. 

అధిష్టానం ఎవరిని నిలబెట్టినా వారి విజయం కోసం  మిగతా వారంతా  పనిచేయాలంటూ బీజేపీ ఇటీవల ఒక తీర్మానం చేసింది.   కమ్యూనిస్టు పార్టీతో పాటు బీఎస్పీ తమ ఓట్లు తమకు పడే విధంగా  కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుంటే తమ బలమేమిటో తాము నిరూపించుకోవాలని, గెలవడం కుదరకపోతే తమ శత్రువును ఓడిస్తామని వీరు శపథం చేస్తున్నారు.