
వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు బయటపడింది. పార్టీ పరంగా విభేదాలు, వ్యక్తిగత కారణాలతో మొదలైన వాగ్వాదం.. చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేదాకా వెళ్లింది. పిడిగుద్దులు కురిపించుకున్నారు. చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో ఓ కార్యకర్త అంగీ చినిగిపోయింది. వరంగల్ జిల్లా కేంద్రం పోచమ్మ మైదాన్‌లోని అబ్నస్ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ గొడవ జరిగింది. డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి స్వర్ణ.. ఫస్ట్ టైం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, పరకాల, నర్సంపేట నియోజకవర్గాలకు చెందిన లీడర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి కూడా అటెండ్ అయ్యారు.
తిట్లతో మొదలై.. కొట్టుకునే దాకా..
కొండా మురళి అనుచరుడు, పరకాల నియోజకవర్గానికి చెందిన పార్టీ లీడర్ కట్ట స్వామి స్టేజీపైకి ఎక్కుతుండగా.. కాంగ్రెస్ వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ సంతోష్ అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బూతులు తిట్టుకున్నారు. తర్వాత వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో ఇరువర్గాల నాయకులు గొడవకు దిగారు. తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈక్రమంలోనే స్టేజీపైకి ఎక్కిన కట్ట స్వామిని కిందికిలాగి దాడి చేశారు. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకుంటూ పిడుగుద్దులు కురిపించుకున్నారు. గొడవలో కట్ట స్వామి అంగీ చినిగిపోయింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎర్రబెల్లి వరద రాజేశ్వర రావు జోక్యం చేసుకుని కట్ట స్వామిని బయటికి పంపేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
ప్లాన్ ప్రకారమే కొట్టిన్రు : కట్ట స్వామి
కొండా వర్గానికి చెందిన కట్ట స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఇనుగాల వెంకట్రామిరెడ్డికి, నాకు కాంట్రాక్ట్ విషయంలో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆ డబ్బుల విషయం తీస్తున్నందుకే నాపై దాడి చేయించాడు. నాకు రూ.3.50 లక్షల వరకు ఇవ్వాలి. ఎన్ని సార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. డబ్బులు అడుగుతున్నందుకే కొట్టించిండు. గొడవలో నా సెల్‌ఫోన్ పోయింది. పోలీసులకు కంప్లైంట్ చేస్తాను”అని కట్ట స్వామి చెప్పారు.
గొడవ చేసినోళ్లకు నోటీసులిస్తాం: స్వర్ణ
ఈ సమావేశానికి మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాజరుకాలేదు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి విషయంలో జరిగిన వర్గపోరు కారణంగానే స్వర్ణ, కొండా వర్గీయుల మధ్య గొడవ జరిగిందనే ప్రచారం జరిగింది. వ్యక్తిగత కారణాల వల్లే కొండా దంపతులు మీటింగ్‌కు హాజరు కాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఎర్రబెల్లి స్వర్ణ చెప్పారు. గొడవలు సృష్టించిన వారికి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.