అసంతృప్తుల దారెటు?

అసంతృప్తుల దారెటు?
  • అసంతృప్తుల దారెటు?
  • కారెక్కుతారా..? కమలం పార్టీలో చేరుతారా!
  • పార్టీ వీడేందుకు సిద్దమైన కాంగ్రెస్ కీలక నేతలు
  • టికెట్ దక్కని నేతలపై ఇరు పార్టీల నజర్
  • పలువురితో బీఆర్ఎస్ పెద్దల సంప్రదింపులు
  • బీజేపీతో కాంటాక్ట్ లోకి వెళ్లిన పలువురు 

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో చాలా మందికి టికెట్ దక్కలేదు. చివరి దాకా ఢిల్లీ వెళ్లి మరీ ప్రయత్నం చేసినా వర్కవుట్ కాలేదు. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు నాయకులు తమ అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. మరికొందరు బీజేపీ, టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ రెండో జాబితా కోసం వెయిట్ చేసిన బీఆర్ఎస్ పెద్దలు తమ ఆపరేషన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. అసంతృప్తులను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. తొలి జాబితాలో టికెట్ దక్కని కొందరు పార్టీ మారారు. ఉప్పల్ టికెట్ ఆశించి భంగ పడ్డ రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకొన్నారు. సెకండ్ లిస్టులో తనకు జూబ్లీ హిల్స్ టికెట్ దక్కుతుందని ఆశించిన దివంగత మంత్రి పీ జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఆయన బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.

మరోవైపు ఇబ్రహీం పట్నం టికెట్ ఆశించిన దండెం రామిరెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని మీడియాకు వెల్లడించారు. మునుగోడు టికెట్ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాసేపట్లో తన అనుచరులతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆయన అనుచరులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ మారాలని, లేదాంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

ఎల్లారెడ్డి టికెట్ ను సుభాష్ రెడ్డికి కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. నాగిరెడ్డి పేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేశ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించారు. తీవ్ర నిరాశతో ఉన్న సుభాష్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి భంగపడ్డ నాగం జనార్దన్ రెడ్డి కారాలు, మిర్యాలూ నూరుతున్నారు. నిన్న ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 

బుజ్జగింపులు వర్కవుట్ అవుతాయా..?

జానారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఏం చేయబోతోంది. అంసతృప్త నేతలు పార్టీ మారకుండా ఆపుతుందా..? లేదా నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగుతుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. కీలక నేతలు రెబల్స్ గా బరిలోకి దిగినా.. ప్రత్యర్థి పార్టీలో చేరినా విజయావకాశాలు దెబ్బతింటాయని ఏఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలను ఢిల్లీ పిలిపించుకొని బుజ్జగించిన విషయం తెలిసిందే. కొందరు ఓకే చెప్పగా మరికొందరిలో మాత్రం అసంతృప్తి అలాగే ఉండిపోయింది. 

అసంతృప్తులపై గులాబీ నజర్

గత కొద్ది రోజులుగా చేరికల మీద దృష్టి పెట్టిన అధికార పార్టీ.. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల కావడంతో తన ఆపరేషన్ ను స్పీడప్ చేసింది. కీలక నేతలు వారితో సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కండువా కప్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగే నేతలపైనే ప్రధానం గా దృష్టి సారించినట్టు సమాచారం. అలా చేయడం ద్వారా కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసే వ్యూహాలకు పదును పెడుతోందని సమాచారం. అసంతృప్త నేతలకు భారీ ప్యాకేజీలతోపాటు, నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇస్తూ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. 

ALSO READ : కేసీఆర్​బంధువులే బీఆర్ఎస్​ను నమ్ముతలేరు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మాజీ కేంద్ర మంత్రులకు మొండి చెయ్యి

మాజీ కేంద్ర మంత్రులకు ఈసారి టికెట్లు లభించలేదు. కంటోన్మెంట్ టికెట్ ఆశించిన సర్వే సత్యనారాయణ, మహబూబాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన బల్ రాం నాయక్ కు టికెట్లు దక్కలేదు. 

సెకండ్ లిస్ట్ లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు..

జడ్చర్ల / నారాయణ పేట్    ఎర్ర శేఖర్
ఎల్లారెడ్డి         సుభాష్ రెడ్డి
నర్సాపూర్        గాలి అనిల్ కుమార్
హుజురాబాద్        బల్మూరి వెంకట్
హుస్నాబాద్        ప్రవీణ్ రెడ్డి
మహబూబాబాద్     బలరాం నాయక్/ బెల్లయ్య నాయక్.
పాలకుర్తి        తిరుపతిరెడ్డి
జూబ్లీహిల్స్         విష్ణువర్దన్ రెడ్డి
అంబర్ పేట్        నూతి శ్రీకాంత్/ మోతె రోహిత్.
మహేశ్వరం         పారిజాత నర్సింహారెడ్డి
దేవరకొండ        వడ్త్యా రమేష్ నాయక్
పరకాల         ఇలనుగాల వెంకట్రామిరెడ్డి 
శేరిలింగం పల్లి    జైపాల్/రఘునాద్ యాదవ్
ఇబ్రహీంపట్నం    దండెం రామిరెడ్డి
మునుగోడు        చల్లమల్ల కృష్ణారెడ్డి
సికింద్రాబాద్ కంటోన్మెంట్    సర్వే సత్యనారాయణ/ పిడమర్తి రవి