
- ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లడంపైనే ప్రధాన చర్చ
- ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్న సీఎం
- పార్టీ అంతర్గత విషయాలపైనాచర్చించే అవకాశం
- శంషాబాద్ నోవాటెల్లో ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని హోటల్ నోవాటెల్లో జరగనుంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు అంశాల ను జనంలోకి తీసుకెళ్లడంపై ఇందులో సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు.
పెద్దఎత్తున ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నా.. ఆశించిన స్థాయిలో జనంలోకి తీసుకెళ్లలేకపోవడం, అదే సమయంలో ఆయా స్కీములపై ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు అధికారపార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో ప్రత్యేక కార్యచరణను ప్రకటించనున్నారు. ఆయా స్కీములపై ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకోనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తారు. బుధవారం నుంచి జూన్ 2 వరకు ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు స్కీములపై ప్రచారం చేపట్టనున్నారు.
అంతర్గత విషయాలపైనా చర్చ..
జిల్లాల్లో కొందరు నేతల నడుమ సమన్వయం లేకపోవడం, సొంత పార్టీలో నేతలే ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. దీని వల్ల ప్రతిపక్షాల చేతికి అస్త్రం ఇచ్చినట్టు అవుతోందని, అదే సమయంలో ప్రజల్లో పలుచన అవుతున్నామని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీనిపైనా సీఎల్పీ సమావేశంలో చర్చ జరగనున్నట్టు తెలిసింది. పార్టీ ప్రయోజనాల కోసం విభేదాలు పక్కనపెట్టి ముందుకు సాగాలని సీఎం చెప్పే అవకాశముంది.
దీంతోపాటు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పదవుల నియామకంలో జరుగుతున్న జాప్యంపైనా క్లారిటీ ఇచ్చే అవకాశముందంటున్నారు. ఇక హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రతిపక్షాలు చేసిన తప్పుడు ప్రచారం, వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమైన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల తీరుపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది.