అంబేద్కర్​ను అవమానించింది కాంగ్రెస్సే: మోదీ

అంబేద్కర్​ను అవమానించింది కాంగ్రెస్సే: మోదీ
  • వారి అబద్ధాలు.. అవమానాల చరిత్రను తుడిచేయలేవు
  • రాజ్యాంగ నిర్మాతను తామే గౌరవించామన్న ప్రధాని

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీయే ఎన్నో సార్లు అవమానించిందని, ఆయన ఆనవాళ్లను సమూలంగా తుడిచిపెట్టేయాలని ప్రయత్నించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. అంబేద్కర్ ను సంపూర్ణంగా గౌరవించింది తాము మాత్రమేనని స్పష్టం చేశారు. పదే పదే అంబేద్కర్ ను ప్రస్తావించడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయిందంటూ మంగళవారం రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో షాను సమర్థిస్తూ ప్రధాని మోదీ బుధవారం ఎక్స్​లో వరుస పోస్టులు పెట్టారు.

‘అంబేద్కర్​కు కాంగ్రెస్ చేసిన అవమానాల లిస్టును రాజ్యసభలో అమిత్ షా బయటపెట్టడంతో ఆ పార్టీ షాక్ అయింది. అందుకే అబద్ధాలు, డ్రామాలతో తమ చీకటి చరిత్రను మరుగున దాచాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ నిజం ఏమిటో ప్రజలకు తెలుసు” అని ఆయన తెలిపారు. అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తే.. ఎన్నో ఏండ్లుగా చేసిన తప్పులను, అంబేద్కర్ కు చేసిన అవమానాలను కప్పిపుచ్చుకోవచ్చన్నదే ఆ పార్టీ ఆలోచన అని అన్నారు.

కాంగ్రెస్ చేసిన పాపాలు ఎన్నో.. 

బాబా సాహెబ్ పట్ల కాంగ్రెస్ ఎన్నో పాపాలు చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘అంబేద్కర్ ను ఒకసారి కాదు రెండుసార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించింది. ఆయనను ఓడించేందుకే అప్పటి ప్రధాని నెహ్రూ ప్రత్యేకంగా ప్రచారం చేశారు. అంబేద్కర్​కు భారత రత్నను తిరస్కరించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్​లో ఆయన చిత్రపటాన్ని ఉంచేందుకు కూడా అనుమతించలేదు” అని తెలిపారు. కాంగ్రెస్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలపై దారుణమైన ఊచకోతలు జరిగాయన్నది ఎవరూ కాదనలేని సత్యమన్నారు. 

పంచతీర్థాలను మేమే అభివృద్ధి చేస్తున్నాం..  

నేడు మనం ఇలా అభివృద్ధి పథంలో వెళ్తున్నామంటే అందుకు కారణం అంబేద్కరే అని మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో అంబేద్కర్ విజన్ ను సాకారం చేసేందుకు తన ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికంలో నుంచి బయటపడేయడం, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ను బలోపేతం చేయడం, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన వంటి అనేక పథకాలను అమలు చేయడం వంటి చర్యలను తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు.

అంబేద్కర్ కు సంబంధించిన చరిత్రాత్మక స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇలా ఏ అంశం తీసుకున్నా అంబేద్కర్ ను సంపూర్ణంగా గౌరవించింది బీజేపీ ప్రభుత్వమేనని మోదీ వివరించారు.