కారు బేజారు..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగేసి స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ విజయం

  •     రెండు నియోజకవర్గాలకే పరిమితమైన బీఆర్ఎస్
  •     సిర్పూర్​లో బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్​ కుమార్​ ఓటమి
  •     మహేశ్వర్​రెడ్డి చేతిలో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పరాజయం
  •     ఫస్ట్ టైం అసెంబ్లీకి ఏడుగురు ఎమ్మెల్యేలు

ఆదిలాబాద్ నెట్​వర్క్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదేండ్ల తర్వాత కాంగ్రెస్ తన ఉనికి చాటుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభావం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన పూర్వ వైభవాన్ని సాధించింది. పది నియోజకవర్గాల్లో మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ సెగ్మెంట్లను క్లీన్ స్వీప్ చేయగా, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ లో గెలుపొందింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో చెన్నూర్ నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి గడ్డం వినోద్, మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు విజయం సాధించారు. ఈ నలుగురిలో మంచిర్యాల మినహా మిగతామూడు సెగ్మెంట్లలో అభ్యర్థులు మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరితో పాటు ముథోల్ బీజేపీ ఎమ్మెల్యే రామరావు పటేల్, సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్, బోథ్ నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్ అనిల్ జాదవ్ మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 

కలిసొచ్చిన సెంటిమెంట్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ చరిత్ర తిరగరాసింది. ఎన్నడూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవని ఈ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఏకంగా నాలుగు చోట్ల విజయ ఢంకా మోగించింది. సిర్పూర్​లో పాల్వాయి హరీశ్​బాబు గెలుపొందగా.. నిర్మల్ లో గట్టి ప్రత్యర్థి, మంత్రి ఇంద్రకరణ్​రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఆయన రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

గత 2019 లో పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి ఆదిలాబాద్ ఎంపీ సీటు కైవసం చేసుకున్న బీజేపీ ఐదేండ్లు తిరిగే సరికి నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుపొందడం విశేషం. అయితే ఇందులో బీజేపీ నుంచి బోథ్ బరిలో ఉన్న ఎంపీ సోయం బాపురావు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ 15 ఏండ్లుగా ఓడిపోతూ ఈ సారి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను కోరారు. ఈ సెంటిమెంట్​ఆయనకు వర్కవుట్​అయ్యింది. ఆదిలాబాద్ చరిత్రలోనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ఇదే మొదటిసారి.

నాలుగు సార్లు గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నను ఈసారి ఓటర్లు తిరస్కరించారు. అటు బోథ్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ జాదవ్ సైతం గత మూడు పర్యాయాలుగా ఓడిపోతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరి విజయవంతమయ్యారు. బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుపై 22,305 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి అనిల్ జాదవ్ కు టికెట్ కేటాయించి బీఆర్​ఎస్ ఆ స్థానాన్ని దక్కించుకుంది. అభ్యర్థిని మార్చినా ఆ పార్టీ ఇక్కడ హ్యాట్రిక్ సాధించింది.

ఆసిఫాబాద్​లో బీఆర్ఎస్, సిర్పూర్​లో బీజేపీ

ఆసిఫాబాద్ నియెజకవర్గం ఓట్ల లెక్కింపు మొదటి నుంచి ఉత్కంఠగా సాగింది. చివరి 22వ రౌండ్ వరకు బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి స్పష్టమైన ఆధిక్యంతో   కొనసాగారు. నియోజకవర్గంలో మొత్తం 184607 ఓట్లు పోలవ్వగా కోవ లక్ష్మి 83052 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్ కు 60242, మూడో స్థానంలో ఇండిపెండెంట్ కోట్నాక్ విజయ్ కుమార్ కు 16469 ఓట్లు వచ్చాయి.

సిర్పూర్ లో బీఆర్ఎస్​అభ్యర్థి కోనేరు కోనప్ప, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ప్రవీణ్​కుమార్​మధ్యే పోరు ఉంటుందని అంతా భావించినప్పటికీ.. అనూహ్యంగా పాల్వాయి హరీశ్​విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై 3088 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  పాల్వాయి హరీశ్ బాబు మొదటి నుంచి ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు.

స్వల్ప మెజారిటీలో నువ్వా, నేనా అన్నట్లు సాగినా చివరకు హరీశ్ బాబునే విజయం వరించింది. కాగజ్ నగర్ మండలంలో బీజేపీకి మొదలైన మెజారిటీ పట్టణానికి వచ్చేసరికి మైనారిటీ ఓట్లతో తగ్గింది. అయితే బెంగాలీ ఓటర్ల లీడ్ హరీశ్ బాబుకు కలిసి రావడం గెలుపులో కీలక పాత్ర పోషించింది. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 186880 పోలవ్వగా హరీశ్ కు 63702, కోనప్పకు 60,614 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 44646 ఓట్లతో మూడో స్థానానికి 
పరిమితమయ్యారు.

మూడు సెగ్మెంట్లలో మొదటి నుంచీ ఏకపక్షమే..

నిర్మల్ జిల్లాలోని మూడు సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదటి నుంచి ఏకపక్షంగానే సాగింది. నిర్మల్ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొదటి రౌండ్ నుండే తన ఆధిక్యతను చాటుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్​అభ్యర్థులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీహరి రావును వెనక్కి నెట్టేశారు. ఆ తర్వాత రౌండ్ రౌండ్ కు ఆయన దూకుడును కొనసాగించారు. మొదటి రౌండ్ లోనే దాదాపు 2,500 పైగా ఓట్ల ఆధిక్యతను సాధించిన ఆయన.. ఆ తర్వా త వరుస రౌండ్లలో ఆధిక్యతను కొనసాగించారు.

అలాగే ముథోల్ సెగ్మెంట్​లో కూడా బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ మొదటి రౌండ్ నుంచే మెజార్టీ సాధిస్తూ వచ్చారు. ఏ రౌండ్ లో కూడా ఆయన వెనక్కి తగ్గకుండా అన్ని రౌండ్లలోనూ మెజార్టీ ఓట్లు సాధించి సిట్టింగ్​ఎమ్మెల్యే విఠల్​రెడ్డిపై 23,419 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ ఎంతో నమ్మకముంచి ఖానాపూర్ టికెట్​ను వెడమ బొజ్జుకు కేటాయించగా.. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టకున్నారు.

6, 8 రౌండ్లలో బీజెపీ అభ్యర్థి రమేశ్ రాథోడ్ స్వల్ప ఓట్ల ఆధిక్యత సాధించినప్పటికీ.. మిగతా రౌండ్లలో లీడింగ్​లో ఉన్న బొజ్జు పటేల్​ ఖానాపూర్​స్థానాన్ని కౌవసం చేసుకున్నారు. రాజకీయాల్లోకి ఇటీవలే ప్రవేశించి పీసీసీ కార్యదర్శిగా నియామకమైన ఆదివాసీ తెగకు చెందిన వెడమ బొజ్జు ఇద్దరు బలమైన ప్రత్యర్థుల ఓడించి రికార్డు బ్రేక్ చేశాడు. బీజేపీ అభ్యర్థి, సీనియర్ నేత, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్​తో పాటు మంత్రి కేటీఆర్ క్లాస్ మేట్, బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ ఓడించి వెడమ బొజ్జు రికార్డు తిరగరాశారు. జిల్లాలో గెలుపొందిన ముగ్గురిలో ఇద్దరు కొత్తవారే. నిర్మల్​ జిల్లాలో బీఆర్​ఎస్​కు ఒక్క స్థానం కూడా దక్కలేదు.