- మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పుడు పీసీసీ చీఫ్
- రాజకీయంగా కలిసి వస్తుండడంతో ఫుల్ డిమాండ్
- ఆరు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉండేలా పార్టీ కసరత్తు
- లంబాడా, మాదిగ, మైనార్టీ, గొల్ల కుర్మ, కమ్మ, రెడ్డికి చోటు!
హైదరాబాద్, వెలుగు: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటేనే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయంగా కలిసొచ్చే పోస్టుగా మారింది. ఆ పదవి చేపడితే రాజకీయంగా తిరుగుండదనే సెంటిమెంట్ ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కనిపిస్తున్నది. లక్కీ పోస్టు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే అనే చర్చ గాంధీ భవన్లో జోరుగా సాగుతున్నది. ఉత్తమ్, రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్న కమిటీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పని చేసిన వారి రాజకీయ దిశ, దశ తిరిగింది. ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్, భట్టి, పొన్నం కొనసాగారు.
ఇప్పుడు ఇందులో ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం, మరొకరు మంత్రి. ఇక నిన్నటి వరకు రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉండగా, ఆయన కమిటీలో మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడాయన పీసీసీ చీఫ్. ఇలా తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పని చేసిన వారు ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు వంటి కీలక పదవులు పొందడంతో.. ఇప్పుడు ఈ పదవికి పార్టీలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇది సెంటిమెంట్ పదవిగా మారింది. అందుకే ఇప్పుడు మహేశ్ కుమార్ గౌడ్ కమిటీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు డిమాండ్ ఏర్పడింది. ఆ పదవిని ఎలాగైనా సరే దక్కించుకునేందుకు సీనియర్ నేతలు పోటీపడుతున్నారు. ఇటు గాంధీ భవన్.. అటు ఢిల్లీలో ఏఐసీసీ నేతల చుట్టూ తిరుగుతున్నారు.
త్వరలోనే పూర్తిస్థాయి కార్యవర్గం
మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా నియమితులు కావడంతో త్వరలోనే పూర్తిస్థాయి కార్యవర్గం ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల సంఖ్యను ఆరు వరకు కొనసాగించాలని భావిస్తున్నారు. ఇందులో ఒకటి మైనార్టీకి, మరొకటి గొల్ల కుర్మ, ఇంకోటి లంబాడాలకు, మాదిగలకు ఒకటి, కమ్మ, రెడ్డిలకు చెరొకటి చొప్పున ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు సమాచారం.
త్వరలో విస్తరించనున్న కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించలేని సామాజిక వర్గాలకు, ఇదే సమయంలో పీసీసీ చీఫ్ పదవి ఆశించిన సామాజిక వర్గాల నేతలకు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులతో తగిన గౌరవం ఇవ్వనున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఇదే కోణంలో ఈ పోస్టులను భర్తీ చేయడంపై కసరత్తు చేస్తున్నట్టు పార్టీలో చర్చ నడుస్తున్నది.