- మధ్యప్రదేశ్‌కు చేరిన న్యాయ్ యాత్ర
- భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
భోపాల్/ జైపూర్: దేశంలోని రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో పాటు ఎంఎస్పీకి చట్టబద్దత కల్పించే అంశాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఈమేరకు శనివారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ ఈ హామీ ఇచ్చారు. మోదీ సర్కారు కేవలం కొద్దిమంది ఇండస్ట్రియలిస్టుల కోసమే ఆలోచిస్తోందని, రైతులను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఐదు రోజుల పాటు నిలిచిన న్యాయ్ యాత్ర శనివారం రాజస్థాన్ లో ప్రారంభమైంది. గ్వాలియర్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చేసే మొట్టమొదటి పని కులగణన చేపట్టడమేనని చెప్పారు.
ఐదు రోజుల విరామం..
న్యాయ్ యాత్ర ఐదు రోజుల విరామం తర్వాత శనివారం మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైంది. రాజస్థాన్‌లోని ధోల్ పూర్ జిల్లాలో.. ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ సుఖ్‌జిందర్ రంధావా, ఇతర నాయకులతో కలిసి రాహుల్ యాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనివారం రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్‌లోకి యాత్ర ప్రవేశిస్తుంది. ఈ నెల 6 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే రాహుల్ యాత్ర కొనసాగుతుంది. 5న ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో రాహుల్ పూజలు చేయనున్నారు. 7న గుజరాత్‌లోకి రాహుల్ఎంటర్ అవుతారు. ఆ తర్వాత 10న గుజరాత్ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. కాగా, మహారాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలాసాహెబ్ థోరట్ శనివారం థానే సిటీ, భివాండిని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.