ఖచ్చితంగా అమలు చేస్తాం.. కాంగ్రెస్ గ్యారెంటీలను చూస్తే బీఆర్ఎస్, బీజేపీకు దడ

కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను చూసి ఇతర పార్టీలు భయపడుతున్నాయన్నారు మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ మెనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు. కేసీఆర్ ప్రకటించిన పథకాల్లో కనీసం పది శాతం అయినా ప్రజలకు అందుతున్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో గళమెత్తిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను ఆదుకోలేవని చెప్పారు. కరీంనగర్ పట్టణంలోని  జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ మెనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  కాంగ్రెస్ మెనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై స్థానిక నేతల నుంచి ప్రతిపాదనల స్వీకరించారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇచ్చిన అరు గ్యారంటీలు తెలంగాణలో  ప్రతి పౌరునికి అందేలా చూస్తామన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. రైతుల డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్,  ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ లు ప్రజల వద్దకి తీసుకువెళ్తున్నామని చెప్పారు. అర్థిక క్రమశిక్షణతో మెనిఫెస్టో రూపొందించి అమలు చేస్తామని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా రూ. 500కే  సిలిండర్,  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. కర్ణాటకలో 62 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణిస్తున్నారని.. రైతు భరోసాలో భాగంగా రెండు లక్షల రుణమాఫీ, రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు అండగా ఏడాదికి 12 వేల రూపాయలిస్తామని హామీ ఇచ్చారు. 
 
వరి పండించే  రైతులకు  క్వింటాల్ కు రూ.  500  బోనస్ ఇస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. వరి రైతు దగా పడుతుంటే.. సివిల్ సప్లై శాఖ మంత్రి అండగా నిలబడ్డారా?  తరుగు పేరిట దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మెనిఫెస్టోలో విద్య, వైద్యానికి  పెద్దపీట వేస్తామని...విద్యుత్ ఉత్పాదన‌ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. గృహజ్యోతి క్రింద 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇస్తామని...ప్రతి మండలంలో CBSE  ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్కూళ్లు నిర్మిస్తామన్నారు. 

యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. చేయూత పథకం ద్వారా వికలాంగులకు రూ. 4000 పింఛన్ అందిస్తామన్నారు. 
సామన్య ప్రజానికం ఇబ్బందులు పడకుండా రాజీవ్ ఆరోగ్య శ్రీ అందిస్తామని చెప్పారు. ప్రతి‌ నియోజకవర్గంలో  వంద‌ పడకల‌ అసుపత్రి నిర్మిస్తామని...ఇళ్ళు లేని‌ నిరుపేదలకు ఇళ్ళు కట్టిస్తామని వెల్లడించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని...ప్రభుత్వంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పథకాలన్నీ అమలు చేస్తాని హామీ ఇచ్చారు. అటు పాత్రికేయులకు ఇంటి‌స్థలం ఇచ్చిన‌ ఘనత కాంగ్రెస్ దే స్పష్టం చేశారు.