రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. 106 పేజీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ కమలనాథ్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, రైతులు సహా అన్నివర్గాల ప్రజలు లబ్ధిపొందేలా.. మేనిఫెస్టోను రూపొందించినట్లుగా ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలోని పౌరులందరికీ రూ. 25 లక్షల ఆరోగ్య బీమా, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు, ఐపీఎల్ టీమ్‌ను ఏర్పాటు చేయడం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించారు కమలనాథ్. పాఠశాల విద్యను ఉచితంగా అందజేస్తామని, పాత పెన్షన్ పథకం అమలు చేస్తామని, రెండేళ్లపాటు యువతకు నెలకు రూ. 1,500 నుంచి 3 వేల రూపాయల వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టో ద్వారా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ చీఫ్. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామంటూ.. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది.
230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2023 నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో 144 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. కమల్‌నాథ్‌ను ఈసారి కూడా ఛింద్వాడా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై నటుడు విక్రమ్ మస్తాల్ పోటీ చేయనున్నారు. త్వరలో మిగిలిన స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది.