అమరుల ఫ్యామిలీలకు రూ.2 కోట్లు:హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

అమరుల ఫ్యామిలీలకు రూ.2 కోట్లు:హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
  • హర్యానాలో కాంగ్రెస్ పార్టీ రెండో విడత మేనిఫెస్టో విడుదల

చండీగఢ్: హర్యానాలో అక్టోబర్ 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ  మేనిఫెస్టో విడుదల చేసింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన హర్యానాలోని అమరవీరుల కుటుంబాలకు రూ.2 కోట్లు ప్రకటించింది. రైతుల సంక్షేమం కోసం కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఇటీవల ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ, కుల గణన, రూ.500కే గ్యాస్‌‌‌‌‌‌‌‌ సిలిండర్లు, 18 నుంచి-60 ఏళ్లలోపు ప్రతి మహిళకు నెలకు రూ.2వేలు, వృద్ధులకు రూ.6 వేలు పింఛన్‌‌‌‌‌‌‌‌, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి 7 గ్యారంటీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. 

శనివారం పలు హామీలతో మరో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. దీన్ని హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఈ సందర్భంగా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.."అన్ని వర్గాలను సంప్రదించిన తర్వాతే మేనిఫెస్టోను తయారు చేశాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలమనే నమ్మకం మాకుంది. ఈ మేనిఫెస్టోతో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే  ధీమా ఉంది. 

రాష్ట్రంలోని రైతుల సమస్యలకు పెద్దపీట వేశాం. చిన్న రైతులకు సబ్సిడీపై డీజిల్ ఇవ్వడంతో పాటు డీజిల్ కార్డును అందజేస్తాం. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమంలో 736 మంది రైతులు చనిపోయారు. వారికి “అమరవీరుడు” హోదా కల్పించి స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తాం. ఆందోళనలో మరణించిన ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. రైతుల సంక్షేమం కోసం కమిషన్ ఏర్పాటు చేస్తాం. వెనుకబడిన తరగతుల క్రీమీలేయర్‌‌‌‌‌‌‌‌ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతాం. ఉపాధి హామీ కింద వేతనాలను రోజుకు రూ.400కి పెంచుతాం. ఏటా జాబ్ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేస్తాం" అని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.