
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సోమవారం నాగర్ కర్నూల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి నీళ్లు, నిధులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ బడ్జెట్ కేటాయించలేదని విమర్శించారు. తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. బీజేపీ ఎంపీలు బడ్జెట్ కేటాయింపులపై స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు బడ్జెట్ పై ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. లైబ్రరీ చైర్మన్ రాజేందర్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
పాలమూరు: కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపించారన్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మల్లు నర్సింహారెడ్డి, ఆనంద్ గౌడ్, వినోద్ కుమార్, ఎన్పీ వెంకటేశ్, చంద్రకుమార్ గౌడ్, జహీర్ అఖ్తర్, వసంత, బెక్కరి ఆనిత, సీజే బెనహర్, అరవింద్ రెడ్డి, సిరాజ్ ఖాద్రీ
పాల్గొన్నారు.
నారాయణపేట: నారాయణపేటలో కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి, కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. డీసీసీ అధ్యక్షుడు కె. ప్రశాంత్ కుమార్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్న కుమారి రెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు.
గద్వాల: కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత విమర్శించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, ప్లకార్డులతో నిరసన తెలిపారు. శ్రీనివాస్ గౌడ్, డీఆర్ శ్రీధర్, రాజశేఖర్ రెడ్డి, కలీం పాల్గొన్నారు.