కడుపంతా విషం నింపుకొని కాంగ్రెస్‎పై విమర్శలు: కాంగ్రెస్

కడుపంతా విషం నింపుకొని కాంగ్రెస్‎పై విమర్శలు: కాంగ్రెస్
  • అధికారంలోకి రావాలని కేసీఆర్‌ పగటికలలు: మంత్రి పొంగులేటి
  • అధికారం పోయిందని అక్కసు వెళ్లగక్కారు: మంత్రి సీతక్క
  • కేసీఆర్​ అవకాశవాదిలా మాట్లాడారు: మంత్రి పొన్నం
  • ప్రజలు ఓడించినా జ్ఞానోదయం కాలే: మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌‌‌ కడుపంతా విషం నింపుకొని, కాంగ్రెస్ పై విమర్శలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్​రజతోత్సవ సభలో ఆయన ప్రసంగం మొత్తం కాంగ్రెస్‌‌‌‌ను విలన్‌‌‌‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్‌‌‌‌ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్‌‌‌‌ చేసిన ప్రసంగంపై హైదరాబాద్ లోని సీఎం నివాసంలో ఆదివారం మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క తో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్‌‌‌‌ తీరును తప్పుబట్టారు. ‘‘గత సీఎం కేసీఆర్​ పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. అప్పులున్నా.. మేం ప్రజలకు  సంక్షేమ పాలన అందిస్తున్నాం. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌‌‌‌ను విలన్‌‌‌‌గా చిత్రీకరిస్తున్నారా? కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడటం బాధ కలిగించింది. రెండుసార్లు బీఆర్ఎస్​కు అధికారం ఇస్తే.. ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమనించారు. 

కేసీఆర్‌‌‌‌ అసెంబ్లీకి వచ్చి.. మంచి సలహాలు ఇస్తారని ఎదురుచూశాం. కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చాక ఐదారు పర్యాయాలు అసెంబ్లీ జరిగింది. కేవలం రెండుసార్లే కేసీఆర్‌‌‌‌ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియెట్​కు కూడా వెళ్లలేదు. ఆయన దొర మాదిరిగా పరిపాలిస్తే.. మా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నది. ప్రజలకు కాంగ్రెస్‌‌‌‌ అందిస్తున్న మంచి పాలన చూసి తట్టుకోలేక కేసీఆర్‌‌‌‌ విషం కక్కారు” అని అన్నారు. 

దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడారు

గతంలో వరి వేస్తే ఉరి అని చెప్పి.. కేసీఆర్‌‌‌‌ మాత్రం 150 ఎకరాల్లో వరి వేశారని మంత్రి పొంగులేటి అన్నారు. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కేసీఆర్‌‌‌‌ మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. ‘‘గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.82 వేల కోట్లు బకాయిలు పెట్టింది. సర్పంచులకు కాంగ్రెస్‌‌‌‌ బకాయిలు పెట్టిందని కేసీఆర్‌‌‌‌ అంటున్నారు. 

మా ప్రభుత్వం వచ్చాక సర్పంచులే లేరు. మా ప్రభుత్వంలో సర్పంచులు ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. అధికారంలోకి రావాలని కేసీఆర్‌‌‌‌ పగటికలలు కంటున్నారు. బీఆర్ఎస్​ సభకు ఆటంకాలు సృష్టించామని కేసీఆర్‌‌‌‌ ఆరోపించారు. సభకు అసలు ఆటంకం సృష్టించలేదు.. మేం ఇబ్బంది పెట్టి ఉంటే సభ జరిగేదా? ఆ పార్టీ నేతలు అడిగినన్ని బస్సులను సభకు పంపాం. ’’ అని పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్​ను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‎కు లేదు: మంత్రి జూపల్లి

కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తన లాంటి వాళ్లను  ఘోరంగా ట్రీట్ చేశారని, ఆ అవమానాలకు కండ్లకు నీళ్లు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. ‘‘ఔటర్ రింగ్ రోడ్డును అప్పనంగా ప్రైవేట్ సంస్థకు అప్పగించిన మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ  పక్కన ఉన్న భూముల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.  మీకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ ఎందుకు వచ్చింది.  ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారో మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదు. 

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారు” అని కేసీఆర్​పై ఫైర్​ అయ్యారు.  బీఆర్ఎస్​ నేతలు నిజాయితీపరులైతే.. ఆ పార్టీ ఖాతాలో రూ.వేల కోట్లు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు.  ‘‘కాళేశ్వరం కార్పొరేషన్‌‌‌‌ ఎండీగా ఉన్న ఉద్యోగి దగ్గర ఇవాళ రూ.వందల కోట్లు దొరికాయి. ఆయనే అంత సంపాదించారంటే.. కేసీఆర్‌‌‌‌ కుటుంబం ఇంకెంత దోచుకుందో అర్థం చేసుకోవాలి. 

దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి ఇచ్చారా? పదేండ్లు  ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉన్న కంచ గచ్చిబౌలి భూములను ఎందుకు పట్టించుకోలేదు. బంగారు బాతులాంటి ఔటర్‌‌‌‌ రింగ్‌‌‌‌రోడ్డును 30 ఏండ్లకు అప్పనంగా అమ్మలేదా..? ఏ తప్పూ చేయకపోతే ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసు నిందితులు విదేశాల్లో ఎందుకు దాక్కున్నారు?’’ అని జూపల్లి ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

 ‘‘రాజకీయ కోణంలో కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది.  కడుపు కోత తెలిసిన ఓ తల్లిగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు.  కొట్లాడి తెలంగాణను తెచ్చుకుంది మీ కోసమో, మీ కుటుంబం కోసమో కాదు..  మీ పదేండ్ల పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేశారు.  మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది’’   అని వ్యాఖ్యానించారు.

ఆడబిడ్డలకు ఫ్రీ బస్​ సౌకర్యాన్ని ఓరుస్తలే: మంత్రి సీతక్క

రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఫ్రీ బస్సులో తిరుగుతుంటే కేసీఆర్​ ఓర్చులేకపోతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘‘మీ కూతురు పెద్ద పెద్ద కార్లలో తిరుగొచ్చు.. కానీ ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా  ప్రయాణించొద్దా’’ అని కేసీఆర్​ను ప్రశ్నించారు.  ఉచిత బస్సు ప్రయాణంతో  ప్రతి మహిళకు నెలకు రూ.3 వేల నుంచి రూ. 4 వేలు ఆదా అవుతున్నదని చెప్పారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్​ఎల్కతుర్తి సభలో అధికారం పోయిందన్న అక్కసును వెళ్లగక్కారు. కేసీఆర్​కుటుంబంలో చీలికలు ఏర్పడుతున్నాయని బాధపడుతున్నరు. 

బీఆర్ఎస్​ హయాంలో ఎమ్మెల్యేలు అధికారులను బెదిరించి  100 శాతం మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినట్లు వారితో సంతకాలు చేయించారు.  మేం గ్రామాల్లో బోర్లను రిపేర్ చేయించాం. మిషన్ భగీరథ కోసం కొత్త సోర్స్​లను సృష్టిస్తున్నం.  ఏటా రూ.వందల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథను మెరుగుపరుస్తున్నాం’’  అని తెలిపారు.  రైతుల ఆత్మహత్యలు గురించి కేసీఆర్​ మాట్లాడితే విడ్డూరంగా ఉందని, వారి హయాంలో 5 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పత్రికల్లోనే కథనాలు వచ్చాయని చెప్పారు.

పోలీస్ వ్యవస్థను కేసీఆర్​ తన సొంత అవసరాలకు వాడుకున్నారని, ఈ రోజు వారినే బెదిరిస్తున్నారని విమర్శించారు.  ఫామ్ హౌస్ కావలి కోసం పోలీస్ శాఖను కేసీఆర్​ దుర్వినియోగం చేశారని అన్నారు.  తాము రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తుంటే కేసీఆర్​​కు నచ్చడం లేదని ధ్వజమెత్తారు.  ఒక నియంత మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని చురకలంటించారు.

తాము అడ్డుకుంటే బీఆర్ఎస్​ సభ జరిగేదా? అని ప్రశ్నించారు.  రాష్ట్ర సుభిక్షంగానే ఉన్నదని, ఆగం కాలేదని చెప్పారు.  అసెంబ్లీ అనేది రాష్ట్రానికి దేవాలయమని, సంస్కరణలు తెచ్చే చర్చా వేదిక అని, అలాంటి పవిత్రమైన అసెంబ్లీని సొల్లు కబుర్లు చెప్పే స్థలం అన్న కేసీఆర్ కు అక్కడ అడుగుపెట్టే అర్హత ఉందా? అని నిలదీశారు. అధికారం పోగానే అసెంబ్లీకి రాని కేసీఆర్​ ఒక నాయకుడా? అని మండిపడ్డారు.   


సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చింది: పొన్నం

కేసీఆర్‌‌‌‌ అవకాశవాదిలా మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ విమర్శించారు. ‘‘ సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌‌‌‌ అనలేదా? ఇవాళ కాంగ్రెస్​ను విలన్‌‌‌‌ అంటున్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఆ సభా వేదికపై ఎందుకు నివాళి అర్పించలేదు. పార్టీ పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎవరికైనా ఇచ్చారా’’ అని నిలదీశారు. 

తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని  డిమాండ్​ చేశారు. సోనియా గాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ ఇవ్వలేరన్న విషయం కేసీఆర్ కు కూడా తెలుసని చెప్పారు. కేసీఆర్ సభకు జనం రాకపోతే పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై నెపం మోపడం సరికాదని అన్నారు.  సభకు జనం రాకపోవడం వల్లే..  ప్రాంగణానికి వచ్చి కూడా కేసీఆర్​ అరగంట సేపు వేదికపైకి రాలేదని అన్నారు.