మాకేం తక్కువ.. పాతబస్తీ బయట ఆరు సీట్లివ్వండి

  • కర్నాటక తరహాలో గెలిచి చూపిస్తాం
  • ఏఐసీసీ ముందు ముస్లిం లీడర్ల ప్రతిపాదన
  • కాంగ్రెస్ లో తెరపైకి కొత్త డిమాండ్
  • 34 సీట్లు కావాలంటున్న బీసీ నేతలు
  • సామాజిక సమీకరణాలు పరిశీలించాలన్న రాహుల్
  •  తలపట్టుకుంటున్న స్క్రీనింగ్ కమిటీ!
  •  అక్టోబర్ ఫస్ట్ వీక్ లో 62 మందితో జాబితా..?

హైదరాబాద్: ముస్లింలంటే పాతబస్తీకే పరిమితమా..? బయట టికెట్లు ఇవ్వండి గెలిచి చూపిస్తాం అంటున్నారు మైనారిటీ లీడర్లు! కాంగ్రెస్ అధిష్టానం ముందు తెలంగాణ వ్యాప్తంగా కనీసం ఆరు టికెట్లు ఇవ్వాలని ముస్లిం లీడర్లు ప్రతిపాదన పెట్టారు. అసెంబ్లీ టికెట్ల కోసం యాభై మంది ముస్లిం నేతలు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాతబస్తీలోనూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపితే గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం 34 సీట్లు ఇవ్వాలని ఓబీసీ లీడర్లు పట్టుబడుతున్న ఈ తరుణంలో ముస్లిం నేతల ప్రతిపాదన స్క్రీనింగ్ కమిటీకి మరో సమస్యలా మారింది. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోటీకి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పాతబస్తీలోని నాంపల్లి సెగ్మెంట్ నుంచి ఫిరోజ్ ఖాన్ బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ నుంచి టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్, వరంగల్ ఈస్ట్ నుంచి అజ్మతుల్లా హుస్సేనీ, నిజామాబాద్ అర్బన్ నుంచి తాహెర్ బిన్ హందాన్, మహబూబ్ నగర్ నుంచి ఒబేదుల్లా కొత్వాల్, ఆదిలాబాద్ నుంచి సాజిద్ ఖాన్, ఖమ్మం నుంచి ఎండీ జావీద్ టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

తెరపైకి కర్నాటక ఫార్ములా

కర్నాటకలో 15 స్థానాలను ముస్లింలకు కేటాయిస్తే 9 చోట్ల విజయం సాధించారని, ఇక్కడ కూడా గెలిచే అవకాశాలున్న మైనారిటీ నేతలకు చాన్స్ ఇవ్వాలని ఆ సామాజిక వర్గానికి చెందిన లీడర్లు ఏఐసీసీని కోరుతున్నారు. అటు ఓల్డ్ సిటీలోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి ఎంఐఎంను దెబ్బ కొట్టాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే, ఏఐసీసీ స్ర్కీనింగ్ కమిటీ సభ్యుడు బాబా జైరుద్దీన్ సిద్దిఖీ ద్వారా స్థానిక ముస్లిం నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

స్క్రీనింగ్ కమిటీ ఉక్కిరి బిక్కిరి

కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, సీనియర్లు, ఓబీసీలు, ముస్లింల ఒత్తిడితో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఉక్కిరి బిక్కిరవుతోంది. కమిటీకి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గెలిచే అవకాశాలున్న లీడర్లకే టికెట్లు కేటాయించాలని, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ ఒత్తిడుల నేపథ్యంలో కాంగ్రెస్ జాబితా వాయిదా పడుతూ వస్తోంది. 

62 మందితో ఫస్ట్ లిస్ట్!

అక్టోబర్ మొదటి వారంలో 62 మందితో కూడిన కాంగ్రెస్ జాబితా వెలువడే అవకాశం ఉంది. టికెట్ల కోసం రకరకాల సమీకరణాలు తెరపైకి వస్తుండంతో సెప్టెంబర్ చివరి వారంలో విడుదలవుతుందనుకున్న జాబితా వాయిదా పడినట్లు సమాచారం.