హైదరాబాద్, వెలుగు: అధికారం పోగానే గిరిజనులు గుర్తొచ్చారా? అని కేటీఆర్ ను దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రశ్నించారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని లంబాడీలు, గిరిజనులు ఇప్పుడు గుర్తుకురావడం ఏమిటని నిలదీశారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మాయమాటలతో ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని విమర్శించారు.
అధికారం కోల్పోగానే ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నుంచి గిరిజనులను వేరు చేయడానికి కేటీఆర్ కుట్రలు చేస్తుండని ఆరోపించారు. ఆయన కుట్రలు, కుతంత్రాలు ఏమిటో తమ గిరిజన బిడ్డలకు తెలుసని అన్నారు. లంబాడీలను అడ్డుపెట్టుకొని కేటీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మానుకోటలో వైఎస్ జగన్ ను ఆనాడు గిరిజనులు తరిమేశారని అంటున్న కేటీఆర్...మరి అప్పుడు అదే జగన్ కు ప్రగతి భవన్ లో విందు ఇచ్చింది కేసీఆర్ కాదా అని బాలు నాయక్ ప్రశ్నించారు.