మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. తమను ఎందుకు అనుమతించరో చెప్పాలని ఆయన పోలీసులను ప్రశ్నించారు . తక్కువ సమయంలో నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టి గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కుంగిపోయిన బ్యారేజ్ పై ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు.
ప్రజల సొమ్మును నీళ్లలో పోశారన్న శ్రీధర్ బాబు... దీనిని చూడటానికి తమ జాతీయ నేత రాహుల్ గాంధీ రావాలా అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం లోపభూయిష్టమని దీనికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ అధికారులు చేసిన తప్పిదం, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లు శనివారం సాయంత్రం కుంగిపోయాయి. 6వ బ్లాక్‌లో 15 నుంచి 20 మధ్య ఉన్న పిల్లర్లలో కొన్ని కుంగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టు బ్రిడ్జి షేప్ మారినట్టు కనిపిస్తోంది. మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్న సిబ్బంది.. గేట్ల నుంచి శబ్దాలు రావడంతో అలర్ట్ అయ్యారు. పిల్లర్లు కుంగినట్టు గుర్తించి వెంటనే మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ చేశారు. దీంతో రెండువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు బారులుతీరాయి.