
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీ. వివేక్ వెంకటస్వామి కలిశారు. సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ నియామకంపై సీఎం రేవంత్ ని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో సింగరేణి ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మొదటి నుంచి సింగరేణి కార్మికుల పట్ల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అండగా ఉంటున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరగకుండా పోరాడుతున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత సింగరేణి సంస్థ, ఉద్యోగుల గురించి రాష్ట్ర అసెంబ్లీ (శాసనసభ)లో ప్రస్తావించారు. డిసెంబర్ 16వ తేదీన సింగరేణి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
శాసనసభలో ఏం మాట్లాడరంటే..?
తెలంగాణ వచ్చినప్పుడు సింగరేణిలో 62 వేల మంది ఉద్యోగులు ఉండేవారని, కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం 39 వేలకు తగ్గించిందని వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామని చెప్పిన బీఆర్‌ఎస్.. ఒక్క సింగరేణిలోనే 23 వేల ఉద్యోగాలను తగ్గించిందన్నారు. కారుణ్య నియామకాల విషయంలోనూ అవినీతికి పాల్పడిందని, సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.27 వేల కోట్లు చెల్లించకుండా భారీగా బకాయిలు పెట్టిందని చెప్పారు. ఈ అంశంపైనా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించి.. ప్రజలకు, సింగరేణి కార్మికులకు నిజానిజాలు తెలియజేయాలని కోరారు.
తమ తండ్రి వెంకటస్వామి, అప్పుడు మంత్రిగా ఉన్న తమ సోదరుడు గడ్డం వినోద్ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఒప్పించి 1,150 మెగావాట్ల కెపాసిటీతో సింగరేణి పవర్ ప్లాంటును తీసుకొచ్చారని గుర్తు చేశారు.