- గతంలో ఒకలా.. ఇప్పుడొకలా తీర్పు: కడియం
- పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని ఫైర్
వరంగల్, వెలుగు: పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేస్తామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. సోమవారం ఆయన హనుమకొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘‘మాకు కోర్టుతీర్పులపై నమ్మకముంది. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేశాక అడ్వకేట్లు, పార్టీ పెద్దలతో మాట్లాడి ముందుకెళ్తాం. ఆదేశాలు సెక్రటరీకి ఇచ్చారా? లేదంటే స్పీకర్‌కు ఇచ్చారా? అనేది చూడాలి. ఆదేశాలు ఏవైనా ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు గతంలో రెండు రకాలుగా తీర్పు ఇచ్చింది.
హైకోర్టు సైతం ఈ అంశంలో గతంలో ఒక రకంగా.. ఇప్పుడు మరో రకంగా తీర్పు ఇచ్చింది. వీటిపై దేశవ్యాప్తంగా రివ్యూ చేయాల్సిన అవసరముంది. యాంటీ డిఫెక్షన్చట్టంపై సుప్రీంకోర్టు రివ్యూ చేసి ఆదేశాలిస్తే, ఎవరూ తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. చట్టంలోని లొసుగులను వాడుకుని, వాటి ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం సరికాదు” అని కడియం అన్నారు.
ఫిరాయింపులకు పాల్పడి విలీనం డ్రామాలు..
రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిందే బీఆర్ఎస్ పార్టీ అని కడియం మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్2014 నుంచి 2023 వరకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పెద్ద సంఖ్యలో చేర్చుకుంది. తర్వాత దానికి విలీనం అని పేరుపెట్టి డ్రామాలు ఆడింది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, చివరకు సీపీఐ ఎల్పీని కూడా విలీనం చేసుకుని అసెంబ్లీలో ప్రతిపక్షాలే లేకుండా చేసింది” అని మండిపడ్డారు. కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు సంబురపడుతున్నారని, కానీ వాళ్లకు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.