హరీశ్​కు ఇన్ని ఆస్తులు ఎక్కడివి? : ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

  • కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రశ్న
  • రేవంత్ పాదయాత్రను చూసి ఓర్వలేకనే కేటీఆర్,హరీశ్​ విమర్శలు
  • కేసీఆర్ గాంధీ కాదు..గాడ్సే అని కామెంట్​

హైదరాబాద్, వెలుగు : మాజీ మంత్రి హరీశ్​ రావుకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని, తెలంగాణ ప్రజల సొమ్ము తిని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఫైర్ అయ్యారు. యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సక్సెస్​ కావడాన్ని జీర్ణించుకోలేకనే కేటీఆర్, హరీశ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. శనివారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్ ను మహాత్మాగాంధీతో పోలుస్తారా..

కేసీఆర్ గాంధీ కాదు గాడ్సే.. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములను అమ్ముకున్న దరిద్రులు మీరు.. మీ లాగా మా సీఎం చిల్లర మాటలు మాట్లాడలేదు. చిల్లర మాటల్లో బీఆర్​ఎస్​ నేతలు బ్రాండ్ అంబాసిడర్లు’ అని ఫైరయ్యారు. పదేండ్లు మూసీపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని, మూసీ అభివృద్ధి పేరిట దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా ప్రజలను ముంచాడని, ఆయన కలెక్టర్ కాదు..

కలెక్షన్ కింగ్ అని మండిపడ్డారు. ‘కేసీఆర్ కట్టిన గుడిలో రేవంత్ పూజలు చేశాడని అంటున్నావు, యాదగిరిగుట్ట నీ అబ్బ జాగీరా’ అని హరీశ్​పై విరుచుకుపడ్డారు. ‘కేసీఆర్.. ఇప్పటికే నీ బిడ్డ జైలుకు పోయింది, త్వరలో నీ కొడుకు కూడా జైలుకు పోతడు’ అని అన్నారు. ఫార్మా సిటీ పేరుతో ఎకరానికి కోటి చొప్పున బీఆర్ఎస్ దోచుకున్నారని ఆరోపించారు. దమ్ముంటే బీఆర్​ఎస్​ నేతలు సీఎం రేవంత్​రెడ్డితో కలిసి మూసీ పాదయాత్రలో పాల్గొనాలని సవాల్ విసిరారు. మూసీ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామన్నారు.