వరంగల్: మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైరయ్యారు. కేసీఆర్ పొద్దుగాల చెప్పి రాత్రి మార్చిపోయే మాటలు వరంగల్ ప్రజలు పట్టించుకోరని ఎద్దేవా చేశారు. వరంగల్ 20 ఏళ్లు వెనక్కు వెళ్ళడానికి కేసీఆర్ కారణమని మండిపడ్డారు. సెంట్రల్ జైలు స్థలాన్ని బ్యాంకు లో కుదువ పెట్టీ రూ.11 వందల కోట్లు తెచ్చి... రూ. 300 కోట్లు ఖర్చు పెట్టి.. రూ. 800 కోట్లు ఎత్తుకెళ్లిన ఘనుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి అన్యాయం చేసిన పాపం కేసీఆర్ దేనని రాజేందర్ రెడ్డి విమర్శించారు. ఎంజీఎంలో ఎలుకలతో రోగులు చనిపోతున్నా పట్టించుకోలేదు.. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు.. కమిషన్ల కోసమే భారీ బిల్డింగ్ కట్టాడన్నారు.
చారిత్రక సెంట్రల్ జైల్ కూల్చి వేయడంతో పోలీస్ శాఖ ఇబ్బందులు పడుతోందని చెప్పారు. జిల్లాలను నాశనం చేసిన కేసీఆర్.. చిలుక పలుకులు పలుకుతున్నాడని అన్నారు. ఏడాది క్రితం తన స్థలం అరూరి రమేష్ కబ్జా చేశాడని మంద కృష్ణ మాదిగ తిరిగాడని.. ఇప్పడు అతనికే ఓటు వేయాలని అనడం ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పారు.
సమస్యలపై అవగాహన ఉండి.. లోక్ సభలో కొట్లాడి తెగల సత్తా ఉన్న విద్యావంతురాలు కావ్యను గెలిపించాలని కోరారు. రాముడి పేరుతో.. కులాలు, మతాల పేరుతో వచ్చే వారి మాటలకు పట్టణ ప్రజలు మోసపోవద్దని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలన్నారు.
ప్రజల సమస్యలపై కొట్లాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అని.. నగరంలో విద్యావంతులు, మేదావులు తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజేందర్ రెడ్డి చెప్పారు.