హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం స్పోర్ట్స్‌ను చాలా నిర్లక్ష్యం చేసిందని నారాయణపేట కాంగ్రెస్ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి విమర్శించారు. 2014 కన్నా ముందు వచ్చిన మెడల్స్, రాష్ట్రం వచ్చాక వచ్చిన మెడల్స్‌ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అన్నారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్పద్దుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వమే క్రీడలను ప్రోత్సహించిందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిగా నిధులను కేటాయించిందని గుర్తు చేశారు.
ప్రతిభ కలిగిన చాలా మంది పేదలు ఆర్థిక సమస్యల కారణంగా క్రీడలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో నా నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా రజిత అనే అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఆమెకు గతంలో చాలా మెడల్స్వచ్చాయి. కానీ, ఆర్థిక సమస్యల కారణంగా ఆమెను తల్లిదండ్రులు ఆటలకు దూరం పెట్టారు. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి నేను మాట్లాడాను. ఇలాంటి ఎంతో మంది పిల్లలు ఆర్థిక సమస్యలతో ఆటలకు దూరమవుతున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.